శనివారం 28 మార్చి 2020
Rangareddy - Feb 13, 2020 , 00:17:59

మాకు దారి కావాలి

మాకు దారి కావాలి

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్‌- చినగొల్లపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు దశాబ్ద కాలంగాకొనసాగుతున్నది. ఊటుపల్లి, కిషన్‌గూడ గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక, పంటపొలాలు, ఇతర రాకపోకల నిమిత్తం ఈ రోడ్డును వినియోగిస్తున్నారు. అదే విధంగా శంషాబాద్‌, కోళ్లపడకల మహేశ్వరం, చినగోల్కొండ, చినగొల్లపల్లి, సంత్‌ ఆశారాం బాపూజి ఆశ్రమం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే శాఖ తిమ్మాపూర్‌- ఉందానగర్‌ జి-14గేట్‌ వద్ద అండర్‌ పాసింగ్‌ రైల్వే క్రాసింగ్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో ఉన్న కాస్తా రోడ్డు మూసుకుపోయి రాకపోకలు సాగించలేని పరిస్థితి దాపురించింది. 


ట్రెంచింగ్‌ నిర్మాణం.. అంతా అయోమయం

ఊటుపల్లి, కిషన్‌గూడ వాసుల శ్మశాన వాటిక, ఇతర రాకపోకల నిమిత్తం సర్వే నంబర్లు 40, 41, 42లలోని భూములను ప్రజా అవసరాల నిమిత్తం గతంలో ఆర్‌ఆండ్‌బీ శాఖ భూ సేకరణ చేయడం జరిగింది. అయితే ఇదే స్థలంలో నిర్మిస్తున్న రైల్వే అండర్‌ బ్రిడ్జికి ఎడమ వైపున ఓ ట్రెంచింగ్‌ ఏర్పాటుచేసి దారి కల్పించేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. కాగా ఊటుపల్లి, కిషన్‌గూడకు చెందిన సుమారు 200 కుటుంబాల పంట పొలాలు, శ్మశాన వాటిక బ్రిడ్జి సమీపంలో ఉండడంతో వారంతా ఇక్కడి నుంచే రాకపోకలు సాగించాలి. అయితే ఈ నిర్మాణం చేపడితే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేది లేక ఆయాగ్రామాల వాసులు ఇరుకుగా రహదారి మార్గం తమకు ఏ మేరకు సరిపడదని బుధవారం ఆందోళన బాట పట్టారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న రైల్వే పనులను అడ్డుకున్నారు. సర్వే నంబర్‌ 42లోని చివరి భాగం నుంచి 40 ఫీట్ల రోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తమకు అనుకూలంగా రహదారి నిర్మాణం చేపట్టే వరకూ రైల్వే అండర్‌పాసింగ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను కొనసాగనివ్వమని హెచ్చరించారు. సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధ్రుతం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, స్థానిక రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.


logo