శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 12, 2020 , 03:41:51

నీటిబొట్టు..లెక్క తప్పొద్దు

నీటిబొట్టు..లెక్క తప్పొద్దు
  • ఒక వైపు 300 మంది ఎన్జీవో బృందాలతో అవగాహన
  • మరో వైపు లీకేజీల నివారణకు ప్రాధాన్యత
  • వేసవి ముగింపు వరకు నీటి వృథా, కలుషిత నీటిపై ఫోకస్‌
  • ఎన్‌ఆర్‌డబ్ల్యూ తగ్గింపునకు డివిజన్‌ల వారీగా యాక్షన్‌ప్లాన్‌
  • నిర్లక్ష్యం వహించే అధికారులకు మెమోలు జారీ
  • అధికారులకు ఎండీ దానకిశోర్‌ హెచ్చరికలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లెక్కల్లోకి రాకుండా పోతున్న జలాలపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. రోజూ సరఫరా చేస్తున్న మంచినీటిలో 170 మిలియన్‌ గ్యాలన్లు(77 కోట్ల లీటర్లు) వృథా అవుతున్నట్లు తేల్చిన అధికారులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. డిమాండ్‌కు తగ్గ ఆదాయం లేకపోవడంతో సంస్థ ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించిన ఎండీ దానకిశోర్‌ సంస్థాగత లోపాలను అధిగమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నాన్‌ రెవెన్యూ వాటర్‌(ఎన్‌ఆర్‌డబ్ల్యూ/తెలిసి ఆదాయంలోకి రాకుండా పోతున్న నీరు)పై దృష్టి సారించారు. పబ్లిక్‌ నల్లాలు, ట్యాంకర్లు, చారిటబుల్‌ ట్రస్ట్‌, మందిరాలతోపాటు ప్రధానంగా అక్రమ నల్లా కనెక్షన్ల రూపంలో నాన్‌ రెవెన్యూ వాటర్‌ నెలవారీ రెవెన్యూ వసూళ్లపై ప్రభావం చూపుతున్నాయి. నెలకు రూ.115కోట్ల డిమాండ్‌ ఉండగా, ఆదాయం దాదాపు రూ.97కోట్ల మేర మాత్రమే వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ వేసవిలో నీటి వృథాను ఎక్కడికక్కడ నివారణ చర్యలు చేపట్టి నీటి కొరతను అధిగమించాలని భావించారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌డబ్ల్యూ తగ్గింపునకు డివిజన్‌ల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ను ఖరారు చేశారు. నగర నీటి సరఫరా వ్యవస్థలో లోపాలకు సంబంధించి పైపులైన్‌లు పగలడం వల్ల ఏర్పడే లీకేజీలు, భూమిలో ఉండే లీకేజీలు, నీటి మీటరింగ్‌లో లోపాలు, అక్రమ కనెక్షన్ల నియంత్రణను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. 


సనత్‌నగర్‌లో పైలెట్‌ ప్రాజెక్టు..

 సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌డబ్ల్యూను ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. డివిజన్‌ 6, 7 పరిధిలోని 32వేల నల్లా కనెక్షన్లకు సంబంధించి ఏడాదిలోగా 20 శాతం మేర ఎన్‌ఆర్‌డబ్ల్యూను తగ్గించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. మాతానగర్‌లో అధ్యయనం పూర్తి చేశారు. డోర్‌ టూ డోర్‌ సర్వే, జియో ట్యాగింగ్‌, పైపులైన్‌కు జీఐఎస్‌ అనుసంధానం, నీటి సరఫరా సమయంలో ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ లాంటివి చేయనున్నారు. సంస్థ ఉద్యోగులతోపాటు ఎన్జీవోలు, వాక్‌ వలంటీర్లు (నీటి సంరక్షణ బృందాలు), కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నీటి వృథాపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించారు.  ఎన్‌ఆర్‌డబ్ల్యూ తగ్గింపులో భాగంగా ప్రాంతాల వారీగా డిస్ట్రిక్‌ మీటరింగ్‌ అసెస్‌మెంట్‌ కీలకంగా చేయనున్నారు. నీటి సరఫరా వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరి చేసుకోవాలనేది, ఇందుకు వెయ్యి నుంచి మూడు వేల నివాసాలు ఉండే ఒక రిజర్వాయర్‌ను ఎంచుకునే తీరు, ఆ తర్వాత దాని పరిధిలో మీటరింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, దానిని డిస్ట్రిక్‌ మీటర్‌ ఏరియా (డీఎంఏ)మార్చడం, ఇందులో రిజర్వాయర్‌, పంపింగ్‌ మోటర్ల వద్ద జోనల్‌ మీటర్లను ఏర్పాటు చేయడం, దాంతోపాటు జీఐ, ఏసీ, ఆర్‌సీ పైపులైన్‌ రీ ప్లేస్‌మెంట్‌(డీఐ పైపులు వేయడం), మీటర్లు పెట్టుకోవడం, వాల్వ్‌ మరమ్మతులు, రిజర్వాయర్ల లీకేజీలను నియంత్రించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 


నీటి అవసరంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగాను నగర వ్యాప్తంగా 300 మంది ఎన్జీవోల ప్రతినిధులు రంగంలోకి దింపారు. నీటి సంరక్షణలో భాగంగా వీటికి అవగాహనకు సంబంధించిన కరపత్రాలు, సామగ్రిని అందజేశారు. వేసవి వరకు కొంత మేర మంచినీటి పొదుపు చేసి పెడితే వేసవిలో నీటి ఇక్కట్లు తగ్గుతాయని వివరించనున్నారు. మంచినీరు అధికంగా వృథాగా అవుతున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వీరు మంచినీటి ప్రాముఖ్యతను వివరించి నీటి వృథాను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం కల్పించనున్నారు. ఇదే సమయంలో వేసవిలో కలుషిత నీటి సమస్య అధికంగా ఉంటుంది? నీరు చాలా వృథా అవుతుంది? ఇక్కడే అధికారులు అప్రమత్తంగా ఉండి కలుషిత నీటి సమస్యకు క్షణాల్లో పరిష్కారం చూపితే నీటి వృథా తగ్గించి నీటి కొరతను అధిగమించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా డివిజన్‌ వారీగా ఎన్‌ఆర్‌డబ్ల్యూ తగ్గింపునకు సంబంధిత అధికారులకు ఎండీ దానకిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు. కలుషిత నీటి నివారణ, నీటి వృథా తగ్గింపుపై అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులకు చార్జీ మెమోలు తప్పవని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. logo