శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 12, 2020 , 03:34:09

త్వరలో బల్దియా చట్టం సవరణ

త్వరలో బల్దియా చట్టం సవరణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఒక చట్టం ఉంటే జీహెచ్‌ఎంసీకి మరో చట్టం ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు నుంచి కొనసాగుతున్న ఈ విధానాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తించే నిబంధనలు, చట్టాలను జీహెచ్‌ఎంసీకి కూడా వర్తింపజేయడంతోపాటు జీహెచ్‌ఎంసీని కూడా ఏకీకృత సర్వీసు నిబంధనల పరిధిలోకి తేవాలని నిశ్చయించారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, దీనికి అవసరమైన ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు.


ప్రస్తుతం నగరంలో జీహెచ్‌ఎంసీ చట్టం-1950 అమల్లోఉన్నది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు దీంతో సంబంధంలేదు. దీన్ని మార్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని కూడా సవరించాలని నిర్ణయించారు. ప్రస్తుత పాలక మండలి గడువు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా చట్ట సవరణ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కొత్త పాలకమండలి వచ్చేలోగా చాలా వరకు జీహెచ్‌ఎంసీ నిబంధనలను ప్రస్తుత మున్సిపల్‌ చట్టం పరిధిలోకి తేవాలని నిశ్చయించారు. ఇందులో ప్రధానంగా ఏకీకృత సర్వీసుల పరిధిలోకి జీహెచ్‌ఎంసీని చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకాలం బల్దియా ఉద్యోగుల బదిలీలు కేవలం బల్దియా పరిధిలోనే జరుగుతుండగా, చట్ట సవరణ అనంతరం రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీలు చేసే అవకాశం కలుగుతుంది. ఇంటి నిర్మాణ నిబంధనలు సైతం మారనున్నాయి. 


500 గజాల వరకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా అనుమతులు పొందే వీలు కల్పించనున్నారు. అలాగే, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేసేందుకు కూడా నిబంధనలు సవరించనున్నారు. దీనిపై ఇదివరకే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పలుమార్లు ప్రకటించారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులు, ప్రకటనల పన్ను తదితర వాటిల్లోనూ సవరణలు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మున్సిపల్‌ చట్టం ప్రకారం భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్నులు నిర్ధారిస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో మాత్రం అనేక రకాల కేటగిరీలు అమలు చేస్తున్నారు. ఇందులో పారదర్శకత లేకపోవడంతో భారీగా అవినీతి చోటుచేసుకుంటోంది. ఉదాహరణకు ఒకే ప్రాంతంలో ఒకే విధమైన భవనానికి ఒకరికి  కేవలం రూ.300 పన్ను విధిస్తుంటే, మరొకరికి రూ.30వేలు పన్ను విధిస్తున్నారు. అంతేకాదు, ఏకపక్షంగా విధిస్తున్న ఈ పన్నులపై అప్పీలు చేసుకున్నా సవరించే పరిస్థితి లేకుండా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను విధానంలోనూ మార్పు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 


అలాగే, ప్రస్తుత మున్సిపల్‌ చట్టం ప్రకారం కార్పొరేటర్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సైతం ఇతర మున్సిపాలిటీల్లో మాదిరిగా నిబంధనలు విధించనున్నారు. ఒకవేళ పాలనాతీరు సరిగాలేకుండా వారిని తొలగించే విధంగా చట్టంలో సవరణ చేయనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టంలో సమూల మార్పుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివిధ అంశాల్లో మార్పులు ప్రతిపాదిస్తూ చట్ట సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే జీహెచ్‌ఎంసీ చట్టంలో చాలా వరకు సవరణలు జరుగుతాయని ఆయన వివరించారు. 


logo