శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 10, 2020 , T00:55

డీసీసీబీపై గులాబీ గురి

డీసీసీబీపై గులాబీ గురి

డీసీసీబీపై గులాబీ ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఏసీఎస్‌లను దక్కించుకునేందుకు ప్రణాళికలు జిల్లాల విభజన జరిగినా.. మాత్రం పాత జిల్లా కొనసాగుతున్నది. దీంతో ప్రాధాన్యం పెరిగిన ఈ పదవి కోసం టీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు బడా నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులతో చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 37, మేడ్చల్‌లో 9, వికారాబాద్‌ జిల్లాలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 68 సొసైటీల డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

  • చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు వ్యూహం
  • అధిక పీఏసీఎస్‌ల గెలుపే లక్ష్యంగా నేతల ప్రణాళికలు
  • పదవి కోసం నాయకులప్రయత్నాలు..
  • ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం
  • ఉమ్మడి జిల్లాలో 68 సొసైటీలు.. 884 డైరెక్టర్‌ స్థానాలు

(రంగారెడ్డి జిల్లా ప్రతినిథి, నమస్తే తెలంగాణ):సహకార ఎన్నికల సమరం వేడెక్కింది... పీఏఎసీఎస్‌ల ను దక్కించుకోవడంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండే డీసీసీబీపై గులాబీజెండా ఎగుర వేసేందుకు ‘గులాబీ దళం’ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాస్థాయి కావడంతో డీసీసీబీ చైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తమ ఖాతా లో వేసుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. మాజీ జడ్పీటీసీలు, సీనియర్‌ నాయకులు, కీలకనేతల అనుచరులు ఈ పదవిపై కన్నేసి లాబీయింగ్‌ మొదలుపెట్టగా.. మరోవైపు అధిష్టానం బలమైన నాయకుడిని ఈ పదవికీ తీసుకురావడం ద్వారా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లుగా అవకాశాలు కోల్పోయిన ప్రాధాన్యం ఉన్న నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సహకార శాఖలో కీలకమైన డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌) చైర్మన్‌ పదవి ఎవరికి వరిస్తుందన్న విషయంలో రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 

జిల్లాల విభజన జరిగినా డీసీసీబీ మాత్రం పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతున్నాయి. దీంతో ఈ పదవికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి కావడం, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. వీటి పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 37, మేడ్చల్‌లో 9, వికారాబాద్‌ జిల్లాలో 22చొప్పున మొత్తం 68 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డీసీసీబీ ప్రాతినిధ్యం వహించనుండడంతో ఈ పదవికి ఉమ్మడి జిల్లాలో భాగంగా పోటీకి దిగుతున్నారు. 

68సొసైటీల పరిధిలో 884 డైరెక్టర్‌ పదవులు ఉన్నాయి. పదవి ప్రాధాన్యం దృష్ట్యా అందరినీ కలుపుకుపోయే స్వభావం, వర్గాలకతీతంగా అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకునే నేతను ఈ పదవికి ఎంపిక చేయాలనే ఆలోచన చేస్తుంది టీఆర్‌ఎస్‌ పార్టీ. పదవికోసం ప్రయత్నిస్తున్న నాయకులు ఎవరికివారే ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేరుగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

పోటీలో సీనియర్లు 

డీసీసీబీ అధ్యక్ష పదవికి ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు చెందిన నేతలనే డీసీసీబీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయా సొసైటీల నుంచి నామినేషన్లు సైతం వేశారు. డీసీసీబీ చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా నేతల పేర్లు పరిశీలన జరుపుతుంది. సహకార సంఘాల ఎన్నికల్లో వ్యక్తిగత పలుకుబడి, బంధాలు, అనుబంధాలు తదితర అంశాలు ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. మెజార్టీ పార్టీలు కూడా స్థానిక నాయకత్వ నిర్ణయానికే పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలుచోట్ల ఏకగ్రీవాల కోసం మంతనాలు మరింతగా ఊపందుకున్నాయి. చైర్మన్‌/వైస్‌ చైర్మన్‌ పదవుల పంపకాలే లక్ష్యంగా పొత్తుల ఎత్తులు విచ్చుకుంటుండడం తాజా రాజకీయ పరిణామం. శనివారంతో నామినేషన్ల పర్వం ముగిసింది.

‘మనం..మనం ఒకటి’...

  పార్టీ రహితంగా నిర్వహించే పీఏసీఎస్‌ ఎన్నికలు రసకందాయంగా మారాయి. కొన్నిచోట ్ల‘నువ్వా..నేనా’ అనేలా ఉన్నా మరికొన్నిచోట్ల..‘మనం..మనం ఒకటి’ అనేలా పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. గులాబీ దళంతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలు పొత్తుల విషయంపై స్థానికతకే పెద్దపీట వేస్తున్నాయి. స్థానిక నాయకులు, కార్యకర్తల మనోభావాలకు తగినట్లుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీరహితంగా నిర్వహించే ఎన్నికలు కావడంతో అంతా కలిసి పని చేసుకుందామన్న కోణంలోనూ కొన్నిచోట్ల ఆయా పార్టీల నేతలు, స్థానిక కార్యకర్తలు మంతనాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల మూడు గ్రామాలకు కలిపి ఒక పీఏసీఎస్‌ ఉండడంతో ఆయా గ్రామాల పెద్దలు, ప్రజాప్రతినిధులు సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. సామాజికవర్గాలు, అంగబలం, అర్థబలం, పలుకుబడి తదితర విషయాలను గమనంలోకి తీసుకుని చర్చల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. తొలుత ఎవరైనా మాటకు కట్టుబడి ఉండాలన్న నిబంధనను తీసుకొస్తున్నారు. పీఏసీఎస్‌ల పరిధిలో దాదాపు 13వరకు డైరెక్టర్‌ పదవులు ఉండడంతో రిజర్వేషన్లవారీగా ఆశావహులు నామినేషన్లు దాఖలుచేశారు. వారిలో ఇప్పుడు పేర్లు పరిశీలన జరుపుతున్నారు. నేడు నామినేషన్ల పరిశీలన తర్వాత ఏకగ్రీవాలు లక్ష్యంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుకు కదులుతున్నారు.

14నియోజకవర్గాల్లో 68సొసైటీలు

ఉమ్మడి జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌ తదితర నియోజకవర్గాల పరిధిలో సహకార ఎన్నికలకు సమరం సాగుతోంది. అయితే ఇందులో శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్‌ తదితర నగర శివారు నియోజకవర్గాల్లో సొసైటీలు లేవు. ఆయా ప్రాంతాల్లో 68సొసైటీల పరిధిలో 884 డైరెక్టర్‌ పదువులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మొత్తం మీద గులాబీ దళం డీసీసీబీపై గులాబీజెండా ఎగురవేయడం ఖాయం కానుంది.


logo