సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 05, 2020 , 01:20:53

సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

సహకార ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ:జిల్లాలో ఈనెల 15వ తేదీన నిర్వహించే ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత జిల్లా అధికారులతో మంగళవారం జేసీ హరీశ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ మాట్లాడుతూ..జిల్లాలో 37ప్రాథమిక సహకార సంఘాలకు జరిగే ఎన్నికల్లో 85,942 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో మామిడిపల్లి పీఏసీఎస్‌ మినహా 34 పీఏసీఎస్‌లు,మూడు రైతు సేవా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్‌,ఓట్ల లెక్కింపుకు గాను ఇప్పటి వరకు 35ప్రభుత్వ పాఠశాలల భవనాలు,రెండు ప్రైవేట్‌ పాఠశాల భవనాలను గుర్తించామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ  6,7,8 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యా హ్నం 3గంటల వరకు స్వీకరించి, 9వ తేదీన 11 గంటలకు నామినేషన్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు సాయం త్రం  అభ్యర్థులకు గుర్తులను ఎన్నికల అధికారి కేటాయిస్తారని చెప్పారు. 15వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. సహకార ఎన్నికల పోలింగ్‌ స్టేషనన్నింటినీ తనిఖీ చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. పోలింగ్‌ బాక్స్‌లను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో భద్రపర్చాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందిని చేరవేయడానికి అవసరమైన వాహనాలను సమకుర్చాలని రవాణా శాఖాధికారిని ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. సమావేశంలో డీసీవో జనార్దన్‌రెడ్డి,అనితలతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


logo