శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 02, 2020 , 01:04:06

ఐటీ హబ్‌లో‘ స్ట్రీట్‌ఫుడ్‌'

ఐటీ హబ్‌లో‘ స్ట్రీట్‌ఫుడ్‌'

హైదర్‌నగర్‌: ఐటీ కేంద్రంలో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ జోన్‌ సిద్ధమైంది.  లక్షలాది ఐటీ ఉద్యోగులకు కేంద్రమైన ఈ ప్రాంతంలో  అందుబాటులోకి వస్తున్న ఈ ప్రత్యేక ఫుడ్‌ హబ్‌ దేశంలోనే మూడోది.  ఇప్పటి వరకు ఇవి దేశంలోని ముంబాయిలోని చౌపతి ప్రాంతంలో, అహ్మదాబాద్‌లోని కంకారియా ప్రాంతాలలో మాత్రమే ఉండగా...తాజాగా ఇక్కడ ఏర్పాటైన ఫుడ్‌హబ్‌ దేశంలో మూడోదిగా తన ప్రత్యేకతను సొంతం చేసుకోబోతోంది.  అయితే నగరంలోని శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ పరిధిలోని ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌లో ఏర్పాటైన స్టాళ్లు మొత్తం రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో మాత్రమే తయారు చేసినవి కావటం గమనార్హం. మిగిలిన రెండు ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉండగా...ఇక్కడివి మాత్రమే పర్యావరణ హితమైనవిగా రికార్డు సాధించనున్నాయి.  వినూత్న ఆలోచనలకు, ఆచరణలకు వేదికగా ఉన్న వెస్ట్‌ జోన్‌ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారిణి దాసరి హరిచందన ప్రత్యేక కృషి మేరకు పర్యావరణ హితమైనరీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ స్టాళ్ల ఏర్పాటే కాకుండా ...పూర్తిగా వాటిని ఫుడ్‌ హబ్‌గానూ నగర ప్రజలకు కమ్మని రుచులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 


 చిరు వ్యాపారులకు ప్రత్యేక శిక్షణ సైతం..

 ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు , వీధి వ్యాపారులకు తగిన రక్షణ కల్పించేందుకు గాను ఈ  వినూత్న స్ట్రీట్‌ వెండింగ్‌ ఆలోచనలకు అంకురార్పణ పడింది. ఐటీ ప్రాంతంలో ట్రాఫిక్‌ దృష్ట్యా  రెడ్‌, గ్రీన్‌, బ్లూ జోన్‌లుగా అధికారులు విభజించారు. వీధి వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించిన రెడ్‌ జోన్‌లో నష్టపోతున్న వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వెండింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. సాధారణ సిమెంట్‌, ఐరన్‌ కట్టడాలకు భిన్నంగా రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ను పునర్వినియోగించాలన్న జడ్సీ హరిచందన ఆలోచనల మేరకు వెండింగ్‌ జోన్‌ దుకాణాలు రూపుదిద్దుకున్నాయి. మొత్తం 20 టన్నుల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి 50వరకు దుకాణాలను తయారు చేసి జోన్‌ పరిధిలోని శిల్పారామం, చట్నీస్‌కు వెనుక వైపు ఈ దుకాణాలను ఏర్పాటు చేసారు. ఇక్కడి ఫుడ్‌హబ్‌ ప్రాంతాన్ని అందమైన వాల్‌ పేయింటింగ్స్‌, టాయిలెట్లు, తాగునీటి వసతి, సీసీ కెమెరాలు, డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేసారు.  లాటరీ విధానం ద్వారా వీధి వ్యాపారులను ఎంపిక చేసి దుకాణాలను ఇప్పటికే కేటాయించారు.ఈ50దుకాణాల్లో ప్రత్యేకంగా ఆహార పదార్థాలనే విక్రయించేలా ఏర్పాటు చేసారు. ఇందుకోసం చిరు వ్యాపారులకు ‘ఫుడ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఏఎస్‌ఏఐ) సంస్థ ద్వారా  పరిశుభ్రత, శుచి, రుచిగా ఆహార పదార్థాలను తయారు చేసే లా మూడు దఫాలుగా ప్రత్యేక శిక్షణ సైతం ఇప్పించారు. 


ప్లాస్టిక్‌ రహిత వ్యాపారం....

శేరిలింగంపల్లి వెస్ట్‌జోన్‌ పరిధిలోని శిల్పారామం సమీపం లో ఏర్పాటు చేసిన హైద్రాబాద్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ ప్రాంతం లో ప్లాస్టిక్‌ను నిషేధించబోతున్నారు. వ్యాపార నిర్వాహకులెవరూ  ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్టాస్టిక్‌ గ్లాసులు వినియోగించకుండా చూడబోతున్నారు. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థకు ఇందులో ఓస్టాల్‌ను కేటాయించగా... ప్లాస్టిక్‌ రహిత పేపర్‌ ప్లేట్లు, గ్లాసులు, కవర్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు. తద్వారా వ్యాపారులెవ రూ ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ను వినియోగించకుండా అక్కడికక్కడే తగిన వనరులను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసారు. మరో స్టాల్‌లో జ్యూట్‌ బ్యాగుల విక్రయానికి కేటాయించారు. తద్వారా స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ పూర్తిగా ప్లాస్టిక్‌ రహిత వ్యాపార కేంద్రంగా మరో ప్రత్యేకతను సాధించబోతున్నది. స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ జోన్‌ సోమవారం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నది.logo