శనివారం 28 మార్చి 2020
Rangareddy - Jan 29, 2020 , 04:04:38

సకల సదుపాయాలతో ‘డబుల్‌' ఇండ్లు

సకల సదుపాయాలతో ‘డబుల్‌' ఇండ్లు

బన్సీలాల్‌పేట్‌ : దేశంలోనే గర్వించదగిన విధంగా ఐడీహెచ్‌ కాలనీలోని పేదలకు రెండు పడక గదుల ఇండ్లను నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పాడి పరిశ్రమ, పశు సంవర్ధకశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.43 లక్షల వ్యయంతో న్యూబోయిగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన 15 దుకాణాల నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని మంగళవారం బన్సీలాల్‌పేట్‌ కార్పొరేటర్‌ కె.హేమలత, జీహెచ్‌ఎంసీ బేగంపేట్‌ సర్కిల్‌ కమిషనర్‌ నళిని పద్మావతి, సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ బాలశంకర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఇండ్లలో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న ఐడీహెచ్‌ కాలనీని సందర్శించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజల కష్టాలను స్వయంగా చూసి, వారు కూడా గౌరవప్రదంగా జీవించాలని ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులు చెల్లించే అవసరం లేకుండా పూర్తి ఉచితంగా సకల సదుపాయాలతో దేశంలోనే తొలిసారిగా 396 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో నగరంలో రూ.8500 కోట్ల వ్యయంతో ఒక లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, అందులో తమ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.119 కోట్లతో 1552 ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. 


పేద ప్రజలకు ఆర్థికంగా చేయూతనందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, అందులో భాగంగా ఇండ్ల నిర్మాణ సమయంలో దుకాణాలు కోల్పోయిన నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించడానికి 15 దుకాణాలు నిర్మించి అందజేస్తున్నామని, అందులో కూరగాయలు, టైలరింగ్‌, కిరాణ, లాండ్రి వంటివి ప్రజలకు నిత్యావసర దుకాణాల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయించామని చెప్పారు. దుకాణాల కోసం డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున మరో అదనపు అంతస్తును నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఐడీహెచ్‌ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో కింద బస్తీ దవాఖానను, పైఅంతస్తులో యువకుల కోసం జిమ్‌ను మరో వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో హౌజింగ్‌ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, డీఈఈ గంగాధర్‌, ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈఈ లౌక్య, మాజీ కార్పొరేటర్‌ ఏసూరి సావిత్రి, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు వెంకటేశన్‌ రాజు, నాయకులు జి.పవన్‌కుమార్‌ గౌడ్‌, కె.లక్ష్మీపతి, ఏసూరి మహేశ్‌, మహాశక్తి యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు జె.వినోద్‌, ఎల్‌.సురేశ్‌, కె.శివకుమార్‌, టిల్లు, ఎం.మహేశ్‌, గజ్జెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


logo