బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 29, 2020 , 03:55:03

మురుగును తప్పించి.. ఓవర్‌టేక్‌ చేయబోయి

మురుగును తప్పించి.. ఓవర్‌టేక్‌ చేయబోయి
  • - బస్సుకింద పడి.. యువతి మృతి
  • - యూసుఫ్‌గూడలో ఉదయం 8.48 గంటలకు ఘటన

వెంగళరావునగర్‌ : రహదారిపై మురుగునీటి ప్రవాహం, మరో వైపు ఆర్టీసీ బస్సు రావడం.. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి అదుపుతప్పి బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే దుర్మరణ పాలయ్యింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని యూసుఫ్‌గూడ రహదారిలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదం స్థానికంగా భయంగొలిపే పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఎస్సై నరేశ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...


ఎల్‌బీ నగర్‌కు చెందిన లక్ష్మీరెడ్డికి ఇద్దరు కూతుళ్లు. వీరిలో చిన్న కుమార్తె సాయి దీపికా రెడ్డి(24) సనత్‌నగర్‌లో తన సహచరుల వద్ద ఉంటూ జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజస్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నది. రోజూ మాదిరిగానే డ్యూటీకని ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి తన హోండా యాక్టివా వాహనంపై బయలుదేరింది. అమీర్‌పేట సారధీ స్టూడియోస్‌ మీదుగా యూసుఫ్‌గూడ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఉదయం 8.48 గంటల ప్రాంతంలో అనుకోని ప్రమాదం ఆమెకు ఎదురయ్యింది. యూసుఫ్‌గూడ మార్గంలో ఆంధ్రాబ్యాంకు వద్ద ఎడమవైపు రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్నది. ఎడమవైపు నుంచే తన బైక్‌ పై ప్రయాణిస్తున్న దీపికారెడ్డి ఎదురుగా మురుగునీటి ప్రవాహం కనిపించేసరికి వాహనాన్ని నెమ్మదించింది. ఆ సమయంలో సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ వెళ్తున్న 10హెచ్‌ రూట్‌ నంబరు గల బస్సు పక్కకు రావడంతో వాహనం అదుతప్పింది. మురుగునీటి కారణంగా వాహనం వేగాన్ని నియంత్రించే క్రమంలో బస్సు వెళ్తున్న కుడివైపునకు అదుపుతప్పి పడిపోయింది. దీంతో బస్సు వెనుక చక్రాలు దీపికారెడ్డి పై నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న దీపికారెడ్డి మేనమామ రవీందర్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు దీపికా రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ ఆబ్దుల్‌ రవూఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలోనే.. 

ఒక్క సారిగా పెద్ద శబ్దం రావడం, ప్రయాణికులు కేకలు వేయడంతో బస్సును ఆపి చూసే సరికి రహదారిపై యువతి రక్తపు మడుగులో పడి ఉంది. బస్సును ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో రోడ్డుపై పారుతున్న మురుగు నీరును తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి వెనుక చక్రాలను ఢీ కొనడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నాను.

-అబ్దుల్‌ రవూఫ్‌, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ 


logo
>>>>>>