గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 26, 2020 , 02:32:04

పుర పోరులో తిరుగులేని కారు

పుర పోరులో తిరుగులేని కారు
  • - మేడ్చల్‌ జిల్లాలో క్లీన్‌స్వీప్‌
  • - 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లను కైవసం చేసుకున్న గులాబీసైన్యం
  • - చేతులెత్తేసిన ప్రతిపక్షాలు
  • - ఫలించిన టీఆర్‌ఎస్‌ నేతల‘సమిష్టి’ మంత్రం


సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ఎన్నికలు ఏవైనా కారు దూసుకుపోతున్నది. దీని స్పీడ్‌ను అందుకోవడం ప్రతిపక్ష పార్టీల తరం కావడం లేదు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్‌  ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం పురపాలక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి సత్తా చాటింది. పటిష్ట నాయకత్వం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలు పార్టీకి అస్త్రశస్ర్తాలుగా ఎన్నికల యుద్ధంలో వీర విజయం పొందేలా చేస్తున్నాయి. ఇదే తరహాలో రానున్న కంటోన్మెంట్‌ బోర్డు, బల్దియా ఎన్నికల ఫలితాల్లో కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చే అవకాశముంది.

మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కారు స్పీడ్‌కు  ప్రతిపక్ష పార్టీలు కకావికలమై అత్తెసరు ఓట్లు, సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రేపు జరుగబోయే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌ , వైఎస్‌ చైర్మన్‌ సీట్లను కూడా ప్రతిపక్షాలు ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కైవసం చేసుకోనున్నది. శనివారం వెల్లడైన ఫలితాల్లో  మేడ్చల్‌ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో, 4 కార్పొరేషన్లలో క్లీన్‌స్వీప్‌ చేసి గులాబీ జెండా ఎగురవేసింది. రంగారెడ్డి జిల్లాలోని అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.