శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 25, 2020 , 03:15:14

‘పుర’ పోరులో గెలిచేదెవరో..?

‘పుర’ పోరులో  గెలిచేదెవరో..?
  • -నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • -మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు శనివారం తేలనున్నాయి. సుమారు 25 రోజులుగా సాగిన ‘పుర’ సమరంలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది నేడు తేటతెల్లం కానున్నది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ షురూ అవుతుందని, మధ్యాహ్నం 4 గంటల వరకు దాదాపుగా అన్ని ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 4 కార్పొరేషన్లకు, 9 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియను 11 ప్రాంతాల్లో చేపట్టేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 1016మంది ఉద్యోగులు ఈ కౌంటింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్నారని, ఇందులో 339మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 30మంది మైక్రో అబ్జర్వర్లు, 677 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్స్‌ ఉన్నారని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ.రెడ్డి తెలిపారు. 284 వార్డులు/డివిజన్లకు గాను 388 కౌంటింగ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.  ఇందులో దమ్మాయిగూడ 24, జవహర్‌నగర్‌ 38, నాగారం 27, పోచారం 24, ఘట్‌కేసర్‌ 24, తూం కుంట 21, నిజాంపేట 44, కొంపల్లి 24, గుండ్లపోచంపల్లి 20, బోడుప్పల్‌ 38, పీర్జాదీగూడ 35, మేడ్చల్‌ 31, దుండిగల్‌ 38 టేబుల్స్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇందులో ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున విధులు నిర్వహించనున్నారు. అలాగే 99మంది రిటర్నింగ్‌ అధికారులు, 52మంది మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ అధికారుల సమక్షంలో కౌంటింగ్‌ జరుగనున్నది.

మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్‌ ప్రాంతాలు

దమ్మాయిగూడ మున్సిపాలిటీ, జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-దావిస్‌ హైస్కూల్‌, నాగా రం మున్సిపాలిటీ సెయింట్‌ మేరీస్‌ బేతని కాన్వెంట్‌ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ, పోచారం మున్సిపాలిటీ, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ-నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ, తూంకుంట మున్సిపాలిటీ-తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల, నిజాంపేట కార్పొరేషన్‌ - గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫార్మసీ, కొంపల్లి మున్సిపాలిటీ - కొంపల్లి మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ - సెయింట్‌ అగ్నేస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, బోడుప్పల్‌ కార్పొరేషన్‌ - మా గార్డెన్స్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్‌ - అరోరా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ బ్లాక్‌-ఏ, మేడ్చల్‌- ఎంపీడీవో ఆఫీస్‌ మీటింగ్‌ హాల్‌, దుండిగల్‌-డీఆర్‌కే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

తేలనున్న 1,321 మంది భవితవ్యం...

గత 25 రోజులుగా జరిగిన ‘పుర’ సమరంలో పోటీ పడిన సుమారు 1,321 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనున్నది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సాగిన పోలింగ్‌ ఫలితాలు శనివారం వెల్లడికానుండటంతో బరిలో నిలిచిన నాయకుల్లో ఒకరకమైన ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాలోని 832 పోలింగ్‌ కేంద్రాల్లోని ఓటర్‌ బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూంల నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాలో మొత్తం 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో 289 వార్డులుండగా, వీటిలో 5 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 284 వార్డులకు ఎన్నికలు జరుగగా, 1,321 అభ్యర్థులు బరీలో నిలిచారు. ఇందులో టీఆర్‌ఎస్‌ నుంచి 284 మంది, కాంగ్రెస్‌ నుంచి 248, బీజేపీ 256, టీడీపీ 52, సీపీఎం(ఐ) 2, సీపీఐ 9, స్వతంత్రులు 452, ఇతరులు 17 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
logo