శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 25, 2020 , 03:13:11

నుమాయిష్‌ @ ఏడు లక్షలు

నుమాయిష్‌ @ ఏడు లక్షలు


అబిడ్స్‌, జనవరి 24 నమస్తే తెలంగాణ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన నుమాయిష్‌ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనున్నది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి సందర్శకులు విచ్చేసి ఎగ్జిబిషన్‌ను సందర్శించడంతో పాటు స్టాళ్లల్లో కొనుగోళ్లు చేపడతారు. గురువారం నాటికి 683956 మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించగా శుక్రవారం భారీ సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. దీంతో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సందర్శకుల సంఖ్య ఏడు లక్షలు దాటింది.

నుమాయిష్‌లో కాయిన్‌ మేళా..

 అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేసిన వ్యాపారులకు చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆంధ్రాబ్యాంక్‌ వారు కాయిన్‌ మేళా నిర్వహించారు. వ్యాపారులకు ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల కాయిన్‌లతో పాటు నూతన కరెన్సీని అందించారు. ఈ కాయిన్‌ మేళాను  ఆర్‌బీఐ డీజీఎం కెఎస్‌ చక్రవర్తి ప్రారంభించారు.  ఆంధ్రాబ్యాంక్‌ జీఎం శ్రీనివాస్‌ శాస్త్రి, ఏడీఎన్‌వీ ప్రసాద్‌,  జోనల్‌ కార్యాలయం ఏజీఎం  సుబ్రహ్మణ్యం, ఎగ్జిబిషన్‌ సొసైటీ కోశాధికారి ఎన్‌.వినయ్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, సభ్యులు ఎల్‌ మంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గ్రాండ్‌ మ్యూజికల్‌ నైట్‌..

ఎగ్జిబిషన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గ్రాండ్‌ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు.

నేడు సినీ నటి జమునకు సన్మానం

 నుమాయిష్‌ నిర్వహణ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా శనివారం యంగ్‌ మామ్స్‌ పోటీలను నిర్వహించనున్నారు. అదే విధంగా ప్రముఖ సినీనటి జమునను సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ కోశాధికారి ఎన్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. 
logo