గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 23, 2020 , 01:52:04

బిల్లుల వసూలులో నిర్లక్ష్యం వద్దు

బిల్లుల వసూలులో నిర్లక్ష్యం వద్దు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాణిజ్య కేటగిరిల నీటి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి నెలా సరాసరి రెవెన్యూతోపాటు అదనంగా 20శాతం వాణిజ్య బకాయిల బిల్లుల వసూలును లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రెవెన్యూ వసూలులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎండీ అధికారులను హెచ్చరించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, ఎన్ ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచినీటి సరఫరా మొదలైన 5 నుంచి 15 నిమిషాలు నీటిని వృథాగా వదిలేస్తున్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో నివేదిక రూపొందించాలని ఎండీ పేర్కొన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి వృథాపై అవగాహన కార్యక్రమాలు మరింతగా చేపట్టి నీటి వృథాను తగ్గించాలని సూచించారు.

సివరేజీ, మంచినీటి సరఫరా కలిసి ఉన్న ప్రాంతాల్లో మం చినీటిలో మురుగునీరు కలిసే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాలను గుర్తించి ఆయా పైపులైన్లకు మరమ్మత్తులు చేయడానికి అంచనాలు రూపొందించాలన్నారు. మంచినీటి సరఫరాలో పైపులు, వాల్వ్ ధ్వంసమై ఉన్న లేదా వృథా పోయే మంచినీటిని అరికట్టడానికిగానూ 10రోజుల్లో నివేదిక సమర్పించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. వాక్ కార్యక్రమంలో భాగంగా బ్రాండింగ్ (ప్రతి ఇంటికి మంచినీటి వాడకంపై కేటాయించే రంగు గుర్తులు) ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవిలతోపాటు సంబంధిత సీజీఎం, జీఎం, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.logo