సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 21, 2020 , 00:46:06

మరో రెండు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు

మరో రెండు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  నగరంలో వెలువడే వ్యర్థాలతో విద్యుత్‌ తయారు చేసేందుకు త్వరలోనే మరో రెండు వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో 20మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

 జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం 20మంది ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందం సందర్శించింది. జీహెచ్‌ఎంసీ అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పౌరసేవలను గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిషనర్‌ వారికి వివరించారు. నగరంలో రోజుకు సుమారు ఆరువేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో శాస్త్రీయ పద్ధతుల్లో దాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెత్తను నూటికి నూరు శాతం శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తడి, పొడి చెత్తను విడదీసేందుకు ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తను సేకరించేందుకు దేశంలోనే ప్రథమంగా నగరంలో స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టడంతోపాటు 22 లక్షల కుటుంబాలకు రెండేసి చెత్తబుట్టలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఆన్‌లైన్‌ విధానానికి ఆదరణ లభిస్తున్నట్లు, మూడోవంతు పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తున్నారని తెలిపారు. ఆస్తులను జియోట్యాగింగ్‌ చేసినట్లు వెల్లడించారు. గత 2017-18ఆర్థిక సంవత్సరంలో రూ. 1400 కోట్ల ఆస్తిపన్ను వసూలుకాగా, ఈ ఏడాది మరో రూ. 200 కోట్లు పెరుగుదల సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్‌ సమస్య నివారణలో భాగంగా ప్రధాన రోడ్లను సిగ్నల్‌ ఫ్రీ రహదారులగా మార్చేందుకు సుమారు రూ. 23 వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికను చేపట్టి పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నట్లు కమిషనర్‌ వివరించారు.


logo