గురువారం 09 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 20, 2020 , 01:41:05

స్నాచింగ్‌ల కట్టడిలో సిటీ పోలీస్‌ సక్సెస్‌

స్నాచింగ్‌ల కట్టడిలో సిటీ పోలీస్‌ సక్సెస్‌


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆరేండ్ల క్రితం రోడ్లపైకి మహిళలు రావాలంటేనే స్నాచర్ల బెడదతో భయాందోళనకు గురయ్యేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. మహిళలకు అన్ని విధాలా భద్రత కల్పిస్తూ మేమున్నామంటూ హైదరాబాద్‌ పోలీసులు స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. స్నాచింగ్‌లను పూర్తిస్థాయిలో కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. గతం లో వందల సంఖ్యలో ప్రతియేడు నమోదయ్యే స్నాచిం గ్‌ కేసులు ఇప్పుడు పదుల సంఖ్యకు చేరాయి. అవి కూడా ప్రతి ఏడాది తగ్గుతూ వస్తున్నాయి. ఇందుకు నగ ర పోలీసులకు టెక్నాలజీతోపాటు పీడీ యాక్టులు ఎంతో ఉపకరిస్తున్నాయి. అంతర్రాష్ట్ర స్నాచింగ్‌ ముఠాలను హైదరాబాద్‌ వైపు కన్నెత్తి చూడకుండా నగర పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. 2019లో 14 చైన్‌ స్నాచింగ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 10 కేసులను పోలీసులు ఛేదించారు.

పీడీ యాక్టులతో..!

గతంలో స్నాచింగ్‌లు చేసే ముఠాలు ఒకే రోజు వరుసగా స్నాచింగ్‌ ఘటనలకు పాల్పడి నగరం వదిలి పరారయ్యేవారు. ఇలాంటి ముఠాలన్ని ఇతర రాష్ర్టాలకు చెందినవే ఎక్కువగా ఉండేవి. ఇలాంటి ముఠాలను పట్టుకొని జైల్లో వేయడమే కాకుండా, అలాంటి నేరస్తులపై పీడీ యాక్టు లు కూడా ప్రయోగించారు. దీంతో హైదరాబాద్‌ పోలీసులు స్నాచింగ్‌ ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇతర రాష్ర్టాల ముఠాలు నగరం వైపు కన్నెత్తి చూడడం లేదు. కేవలం స్నాచర్లనే కాకుండా దొంగతనా లు చేసే నేరస్తులపై పీడీ ప్రయోగిస్తున్నారు. జైల్లో ఉండగానే ఆయా నేరస్తులపై నమోదయ్యే కేసులకు సంబంధించిన వాదనలు న్యాయస్థానాలలో త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు నేరస్తులు ఒక్కసారి పీడీ యాక్టులో జైలుకు వెళ్లి ఏడాది గడిచిన తర్వాత బయటకు వచ్చి తిరిగి అలాంటి నేరాలు చేస్తే మరోసారి కూడా అలాంటి నేరస్తులపై పీడీ యాక్టులు ప్రయోగిస్తున్నారు. దీంతో స్నాచింగ్‌ చేయాలంటేనే దొంగలు భయపడుతున్నారు.

స్నాచింగ్‌ చేస్తే.. దొరకడం ఖాయం..!

హైదరాబాద్‌లో ప్రతీ గల్లీలో సీసీ కెమెరాలు ఉన్నాయి.. దొంగతనం చేస్తే దొరికిపోవడం ఖాయం. దీంతో హైదరాబాద్‌లో నేరం చేయాలనుకునే వారిని మూడోకన్ను నిత్యం వెంటాడుతున్నది. ఇలాంటి పరిస్థితులతో హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందులో ప్రధానమైంది స్నాచింగ్‌ ఘటనలు జరుగకుండా పోలీసు లు తీసుకుంటున్న చర్యలతో మహిళలు స్వేచ్ఛగా బయటకు వెళ్తున్నారు. ఏదైనా ఒక స్నాచింగ్‌ ఘటన జరిగిందంటే.. అలాంటి ఘటనలను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఒక్క ఘటన జరిగినా కూడా వెం టనే టాస్క్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగి, ఆయా స్నాచర్లు ఎక్కడున్నా పట్టుకుంటున్నారు. దీంతో నగరంతోపాటు అంతర్‌ జిల్లా దొంగలకు, ఇతర రాష్ర్టాలకు చెందిన దొంగల ముఠాలను సీసీ కెమెరాలు వణికిస్తున్నాయి.
logo