బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 18, 2020 , 00:39:46

విదేశీ విద్యకు బాసట..

విదేశీ విద్యకు బాసట..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశీ చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు చెందిన యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ పథకం అండగా నిలువబోతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడా, సింగపూర్‌ వంటి విదేశాల్లో పీహెచ్‌డీ, పీజీ కోర్సుల్లో విద్యనభ్యసించే అవకాశం లభించనున్నది. కేవలం దరఖాస్తు చేసుకుని, సరైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తే చాలు రూ.20లక్షలు రుణంగా లభించబోతున్నది. అంతే కాకుండా రూ.50వేల లోపు ఏకానమీ క్లాస్‌ విమాన టికెట్‌, వీసా ప్రాసెసింగ్‌ చార్జీలను రాయితీగా పొందవచ్చు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విమలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సారి బీసీ కులాలకు చెందిన వారితోపాటు, ఆర్థికంగా వెనుకబడ్డ బలహీన వర్గాలకు(ఈబీసీ) చెందిన వారికి సైతం ఈ పథకం ద్వారా సహాయం చేయబోతున్నామన్నారు. ఆశావహులు http :// telanganaepass.cgg. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి, ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్‌ సూచించారు.

అర్హతలు, కావాల్సిన ధ్రువపత్రాలు..

- అభ్యర్థి వయస్సు 35 ఏండ్లకు మించరాదు.
- వార్షిక  ఆదాయం రూ.5లక్షలకు మించరాదు.
- మీ-సేవ నుంచి జారీ అయిన కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్‌కార్డ్‌
- ఈ పాస్‌ ఐడీ నంబర్‌
- పాస్‌పోర్ట్‌ జిరాక్స్‌
- విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్‌ 
- జీఆర్‌ఈ, జీమ్యాట్‌, తత్సమాన పరీక్ష స్కోర్‌కార్డ్‌
- టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ కార్డ్‌
- విదేశీ విద్యాలయ అనుమతి పత్రం
- జాతీయ బ్యాంకు పాస్‌బుక్‌


logo
>>>>>>