గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 17, 2020 , 00:41:43

ఐదు దశాబ్దాల కష్టాలకు.. ఐదేండ్లలోనే పరిష్కారం..

ఐదు దశాబ్దాల కష్టాలకు.. ఐదేండ్లలోనే పరిష్కారం..

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి  : బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన అనుభవం మేడ్చల్ జిల్లా ఆడబిడ్డలది.  వారానికి ఒకరోజు వచ్చే ట్యాంకర్ల వద్ద సిగలు పట్టుకొని తగువులాడిన సందర్భాలెన్నో వాళ్ల మదిలో... బిందెడు నీరు రావడం లేదని ఖాళీ బిందెలతో ధర్నాల పేరుతో రోడ్డెక్కిన కష్టం వాళ్లది... ఇది ఒకరోజు రెండు రోజులు కాదు... ఉమ్మడి రాష్ట్రంలో సుమారు ఐదు దశాబ్దాల పాటు తాగునీటి కోసం అల్లాడిన ఆ ఆడబిడ్డల కష్టాలకు కేవలం ఐదేండ్లలోనే పరిష్కారం దొరికింది. ఇంటింటికి నీళ్లిచ్చిన తరువాతనే ఓట్లు అడుగుతానని అపర భగీరథుడు సీఎం కేసీఆర్ శపథం భూని చేసిన ‘మిషన్ భగీరథ’ కార్యం జిల్లాలో ఇంటింటికీ చేరింది..ప్రతి గొంతునూ తడిపింది.                           

రూ.500కోట్లతో భగీరథ ఫలాలు...

హైదరాబాద్ మహానగరంలో భాగంగా ఉన్న మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ విజయవంతమవడంతో జిల్లా ఆడబిడ్డల తాగునీటి కష్టాలకు మోక్షం దొరికింది. గజ్వేల్ తరువాత తొలిసారిగా మేడ్చల్ జిల్లా ప్రజలకే భగీరథ ఫలాలు అందాయి. దీని ద్వారా ప్రతిరోజూ జిల్లాలోని ఘట్ మేడ్చల్, దుండిగల్, పోచారం, జవహర్ బోడుప్పల్, పీర్జాదీగూడ, నాగారం, దమ్మాగూడ, నిజాంపేట, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, తూకుంట మున్సిపాలిటీ పరిధిలోని లక్షల జనాభాకు, జిల్లాలోని 61గ్రామాల ప్రజలకు ప్రతిరోజూ మేలు జరుగుతుంది. ఇందుకు ప్రభుత్వం ఔటర్ వెలుపల రూ.296కోట్లను, ఔటర్ లోపల రూ.200కోట్లను ప్రభుత్వం అందించింది. అలాగే నీటిని సరఫరా చేసేందుకు గాను మేడ్చల్ ఘన్ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని పల్లెల్లో, పట్టణాల్లోని ట్యాంకులు, సంపుల వరకు,అలాగే ఇంటింటికీ సుమారు 1,860 కిలోమీటర్ల మేర పైపులైన్లను ఏర్పాటు చేశారు.
 

నాణ్యతకే ప్రాధాన్యం....

సాధారణంగా ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు అంటే గుత్తేదారులు, అధికారులు కుమ్మక్కై నాణ్యతకు తిలోధకాలు ఇవ్వడం గతంలో సర్వసాధారణం. కానీ మిషన్ భగీరథ పథకంలో చేపట్టే పనుల్లో ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీఠ వేసింది. ముఖ్యంగా పైపులైన్ల ఏర్పాటులో అత్యంత నాణ్యతతో కూడిన 170డిైక్టెల్ ఐరన్ పైపులను వినియోగిస్తున్నారు. ఈ పైపులలో నాలుగు అంచెల క్వాలిటీ ఉంటుంది. ఈ పైపుల లోపలి భాగంలో సిమెంట్ పూత, మధ్యలో జింక్, డిైక్టెల్ ఐరన్ లోహాలు, బాహ్యంగా బిటామిన్ కోటింగ్ వేస్తారు.ఈనాలుగు అంచెల నాణ్యతా విధానంలో రూపొందించిన పైపులను మరో  పైపులోకి చొప్పించి బలమైన, నాణ్యతతో కూడిన రబ్బరు బిరడను ఈ రెండు పైపులకు ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల చుక్కనీరు కూడా లీకేజీ ఆస్కారం ఉండదని, ఎంతటి వత్తిడినైనా పైపులు తట్టుకుంటాయని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
  

అద్భుతమైన డిజైన్.. 50ఏండ్లకు సరిపడేలా...

మిషన్ భగీరథ అమలులో భాగంగా ఈ రెండు జిల్లాలో భౌగోళిక స్వరూపంపై ముందస్తుగానే సంపూర్ణ అధ్యయనం చేసిన ఇంజినీరింగ్ అధికారులుఅద్భుతమైన డిజైన్లను సమకూర్చారు. ఇందులో ముఖ్యంగా అత్యంత ఎత్తున కొండల ప్రాంతాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల, సంపుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంతో మొత్తం ప్రాజెక్టులో 75శాతం వరకు విద్యుత్ వినియోగం లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే ఇంటింటికి నీరు సరఫరా చేసే వెసులుబాటు కలిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ ప్రాజెక్టుఅధికారులు ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ప్రస్తుత జనాభాకు సుమారు 2శాతం అదనపు జనాభాకు సరిడేలా పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు.ప్రస్తుతం 30-40ఏండ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ సుమారు 50ఏండ్ల వరకు పెరిగినా జనాభాకు సరిపడా నీటి సరఫరాకు చేయవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ అంతర్గత పైపులైన్లతో పాటు ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందస్తుగానే ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పథకం అమలుతీరుపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాస్కోప్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీస్) నిఘా సంస్థ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం.

అవాంతరాలను అధిగమించి...

ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సకాలంలో పూర్తి చేసేందుకు అడ్డువచ్చిన అనేక అవాంతరాలను అధిగమించింది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించారు. ముఖ్యం గా ఐదు చోట్ల డబీల్ మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, ఘట్ అంకుషాపూర్ రైల్వే క్రాసింగ్ అనుమతులను, రిజర్వాయర్ల నిర్మాణం కోసం సుమారు 2ఎకరాల భూ సేకరణ ప్రక్రియను, అలాగే 2.20ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ (మజీద్ లాల్ మలక్ కీసర,పోచారం అడవులలో) సేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అనిర్వచనీయం. అలాగే పైపులైన్లు తీసే క్రమంలో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకు కూడా ప్రభుత్వం అదనపు నిధులను వెచ్చించింది.


logo
>>>>>>