గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 14, 2020 , 01:53:02

జంతువులను పరిరక్షించుకోవాలి

జంతువులను పరిరక్షించుకోవాలిఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 13:
 ప్రస్తుత కాలంలో గబ్బిలాల వర్గీకరణకు సరైన ప్రాధాన్యత లేకుండా పోయిందని రాష్ట్ర కాలేజీయేట్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, స్టేట్‌ రూసా ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్నారు. దీనికి ప్రాధాన్యత కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ బయోడైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ స్టడీస్‌ (సీబీసీఎస్‌), జువాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘టెక్నిక్స్‌ ఫర్‌ బ్యాట్‌ ట్యాక్సానమీ, ఎకలాజీ అండ్‌ కన్జర్వేషన్‌'పై అయిదు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నవీన్‌ మిట్టల్‌ హాజరై మాట్లాడారు.  గత ఆరేండ్లుగా ఓయూ జువాలజీ విభాగం, ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ సంయుక్తంగా గబ్బిలాల వర్గీకరణపై పరిశోధనలు చేస్తుందని అలాగే జంతువులను పరిరక్షించుకోవాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ డీఎస్‌టీ - యూకేఐఈఆర్‌ఐ ప్రాజెక్టు యూకే లీడ్‌ ప్రొఫెసర్‌ గరీత్‌ జోన్స్‌ మాట్లాడుతూ తాము ఆరేండ్లుగా ఇక్కడి అధ్యాపకులు, పరిశోధకులను తమ వర్సిటీకి తీసుకువెళ్లి అక్కడ శిక్షణ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా తాము ఇక్కడికి వచ్చి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామన్నారు. తాము నిర్వహించిన మొదటి వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన 28 మందిలో పది మందికి అంతర్జాతీయ గ్రాంట్లు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం, ఓయూ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె. ప్రతాప్‌రెడ్డి, జువాలజీ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ వనితాదాస్‌, సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ సి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.logo