గురువారం 09 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 13, 2020 , 03:33:56

పెద్దఎత్తున బుజ్జగింపులు.. పట్నంలో మరిన్ని ఏకగ్రీవాలు..?

పెద్దఎత్తున బుజ్జగింపులు.. పట్నంలో మరిన్ని ఏకగ్రీవాలు..?

మున్సిపల్‌ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున బుజ్జగింపులకు తెరలేపారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున బుజ్జగింపులకు తెరలేపారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం  మున్సిపాలిటీలో ఇద్దరు  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.  మరిన్ని వార్డుల్లో పోటీలో ఉన్నవారిని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు  సాగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు తమకు అనుకూలంగా నామినేషన్లు  ఉపసంహరించు కోవాలని పెద్ద ఎత్తున ఆఫర్లు  ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ కోసం రూ.లక్షల్లో బేరసారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్‌లుగా పోటీ చేసేవారు, ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసిన వారిని బరి నుంచి తప్పించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మంగళవారం నామినేషన్ల చివరిరోజు కావడంతో ఇబ్రహీంపట్నంలో మరిన్ని వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశమున్నాయి. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులుండగా  ఇప్పటికే రెండు వార్డులు  ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని వార్డుల్లో  ఇద్దరు చొప్పున నామినేషన్లు ఉన్నాయి. అందులో ఒకరి నామినేషన్‌ ఉపసంహరించుకుంటే మరో రెండు నుంచి  మూడు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారిని టీఆర్‌ఎస్‌లోకి చేర్పిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునే వారికి ఇతర నామినేటెడ్‌ పోస్టులను ఇవ్వనున్నట్లు హామీ ఇస్తున్నారు. ఆదిబట్ల, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల్లో  పెద్ద ఎత్తున బేరసారాలకు తెరలేపారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం కోసం  రూ.20 లక్షల నుంచి ముప్పై లక్షల ఆఫర్లు ఇస్తున్నారు.

ఆదిబట్ల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఎనిమిది వార్డులు గెలుచుకున్నవారే మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మున్సిపాలిటీని ఎలాగైనా గెలిపించడం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ సత్తువెంకటరమణారెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎమ్మెల్యే ఈ మున్సిపాలిటీపై దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా అర్హులైన వారిని ఎంపికచేశారు. ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మమ్మరాజుగూడలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.  ఈ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నవారు ఎక్కువ మంది సంపన్న వర్గాలకు చెందిన వారే ఉండటంతో పోటీ తీవ్రంగా కొనసాగుతుంది.

ఈ మున్సిపాలిటీ చైర్మన్‌ జనరల్‌ కేటగిరికి కేటాయించడంతో చైర్మన్‌ పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్దఎత్తున డబ్బులు  పంచుతున్నారు. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కూడా జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది. ఈ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి సతీమణి,మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ రొక్కం భీంరెడ్డి కోడలుతో పాటు టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి కోడలు తదితరులు పోటీ పడుతున్నారు. ఈ మున్సిపాలిటీలో పలు వార్డులల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న ఇండింపెండెంట్‌లను, చిన్న పార్టీల నుంచి పోటీచేసిన వారిని తమకు అనుకూలంగా నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


మరిన్ని వార్డులు ఏకగ్రీవాలయ్యే అవకాశం...?

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆ పార్టీ నుంచి కొన్ని వార్డులకు నామినేషన్‌  దాఖలు చేయకపోగా, నామినేషన్‌  దాఖలు చేసిన వారిలో పలువురు పోటీ నుంచి  తప్పుకుంటున్నారు. ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా  పోటీ చేసిన అమీర్‌ ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన పోటీ నుంచి  తప్పుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మోహీజ్‌ పాషాకు మద్దతు తెలిపారు. 


logo