బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 04:50:28

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ‘పవర్‌గ్రిడ్‌' ఊతం

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ‘పవర్‌గ్రిడ్‌' ఊతం
  • చార్జింగ్‌ ధరలు తగ్గించిన కార్పొరేషన్‌ l ఎలక్ట్రిక్‌ వాహనాలకు ‘పవర్‌గ్రిడ్‌'
  • నగరంలోని వాహనాలకు ఊరట .. పవర్‌ఇవీ యాప్‌తో చెల్లింపులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాహన కాలుష్యంతో నగర వాతావారణం కలుషితమవుతున్నందున దీన్ని తగ్గించేందుకు చాలా సంస్థలు కృషిచేస్తున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ కూడా ఇదే కోవలో సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంఖ్యను పెంచేందుకు భారీగా చార్జీలు తగ్గించింది. ఈ మేరకు నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వాహన విస్ఫోటనం ఎక్కువై కాలుష్య రక్కసి జీవితాలను బుగ్గిచేస్తుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది.
వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వాహనాల చార్జింగ్‌ విషయానికి వస్తే కిలోవాట్‌ విద్యుత్‌ ధరను 24.60 ఉండగా దీనిని తగ్గించి  12.60గా ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, బెంగళూరు నగరాలతో పాటు హైదరాబాద్‌ నగరం కూడా వాహన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు కాకుండా కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడటం ద్వారా కాలుష్యం తగ్గుతుందనే భావనతో ఉన్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రచారం పెద్ద ఎత్తున  జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు నగరంలో కేవలం 1700 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి.

మెట్రోతో పవర్‌గ్రిడ్‌ అవగాహన

ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్స్‌ ఏర్పాటు కోసం హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సంస్థతో  పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఒక అవగాహనకు వచ్చి చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నది. అందులోభాగంగా ఇప్పటికే మియాపూర్‌తోపాటు నాగోల్‌లో చార్జింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. అంతేగాకుండా హైటెక్‌సిటీతోపాటు, పంజాగుట్ట మాల్స్‌ వద్ద చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. వీటిని విస్తరించాలని భావిస్తున్నారు. వీటిని ఇ-ట్యాక్సీలు, ఇ-వెహికల్స్‌ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

మొబైల్‌ యాప్‌తో చెల్లింపులు

పవర్‌గ్రిడ్‌కు సంబంధించిన చార్జింగ్‌ స్టేషన్లలో యాప్‌ద్వారా చెల్లింపులు జరిపే అవకాశముంది. ప్లేస్ట్టోర్‌ నుంచి POWERev యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని  దీనిద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు. మొబైల్‌నంబర్‌ను యూజర్‌ ఐడీగా వాడుకుని సేవలు పొందవచ్చు. పవర్‌గ్రిడ్‌ చార్జింగ్‌ స్టేషన్ల వద్ద మిగతా చార్జింగ్‌ స్టేషన్లతో పోలిస్తే హెవీ డ్యూటీ చార్జర్‌ అందుబాటులో ఉంటుందని పవర్‌గ్రిడ్‌ సంస్థ తెలిపింది.


logo