సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 10, 2020 , 11:02:29

ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పండుగ రద్దీ వేళల్లో ట్రావెల్స్ ఆగడాలకు కళ్లెం వేయడానికి రవాణాశాఖ కొరడా ఝులిపిస్తున్నది. పండుగ సమయాల్లో సురక్షిత ప్రయాణంతోపాటు అధిక టికెట్ చార్జీలు లేకుండా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగనాయక్ ఆదేశాల మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు అధికారులు నగరంలోని వివిధ రూట్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని, అవసరమైతే సీజ్ చేయడం, కంపౌండింగ్ ఫీజు వసూలు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ట్రావెల్స్ నడుస్తుంటాయని, ప్రయాణికుల వివరాల లిస్ట్‌తోపాటు, మండే స్వభావం కలిగిన పదార్థాలను క్యారీ చేయకుండా చూడాలని, ఇద్దరు డ్రైవర్లు లేని ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని సూచించడంతో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. గతంలో జరిగిన పాలెం ఘటన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదేశాల్లో భాగంగా తిరుమలగిరి ఆర్‌టీవో శ్రీనివాస్‌రెడ్డి, మలక్‌పేట ఆర్‌టీవో సుభాష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏఎంవీఐలు బాలు, రజని, లావణ్య తదితరులు కలిసి తనిఖీలు చేపట్టి ప్రైవేటు ట్రావెల్స్‌పై 10 కేసులు నమోదు చేశారు.


logo