శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 10, 2020 , 10:46:26

ఔటర్ చుట్టూ ఆక్సిజన్ పార్కులు

ఔటర్ చుట్టూ ఆక్సిజన్ పార్కులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య తీవ్రత..ఉద్యోగాల ఒత్తిడి..పట్టణీకరణ ..వెరసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్‌కు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చ ల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96. 64కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఇంటెన్వీవ్ మేథడ్ పద్ధ్దతిలో లక్షలాది మొక్కలను నాటుతున్నారు. కిలోమీటర్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మాణం, కనువిందు చేసే ప్రవేశద్వారం పనులు తుది దశకు చేరినట్లు, వచ్చే నెలాఖరులోగా కొన్నింటిని అందుబాటులోకి తీసుకురానున్నామని అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇంతకాలం గుబురు పొదలతో, చెత్త చెదారాలతో వృథాగా ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతాలు ప్రకృతి రమణీయ వాతావరణాన్ని సంతరించుకోనున్నాయి.

స్థానిక ప్రజల నడక కోసం వాకింగ్ పాత్‌వేలను సైకిలింగ్ కోసం సైకిల్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్‌కార్నర్‌లు రానున్నాయి. యోగాసెంటర్‌లను, జనం కూర్చోవడానికి భారీ వృక్షాల కింద రచ్చబండలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సెక్యూరిటీ రూం, టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న ఈ అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ వద్ద కుటుంబ సమేతంగా కాసేపు సేద తీరేందుకు ఎంతోగానో దోహదపడనున్నాయని అధికారులు తెలిపారు.


logo