బొంరాస్పేట, ఆగస్టు4: అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆ తండా పల్లె ప్రగతి కార్యక్రమంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ప్రతి నెలా ప్రభుత్వ నిధులు రావడంతో సంట్రకుంటతండాలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాలో అనేక పనులు చేపట్టారు. రహదారుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదలతో తండా బొంరాస్సేట మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ తండాలో 463 మంది జనాభా, 110 ఇండ్లు ఉన్నాయి.
రూ.32 లక్షలతో అభివృద్ధి పనులు
సంట్రకుంటతండాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో రూ.32 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో కంపోస్టుషెడ్డు, రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.42 వేలతో డంపింగ్ యార్డు నిర్మించారు. రూ.7.20 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. పంచాయతీ పరిధిలోని నాన్యానాయక్తండా నుంచి పీడబ్ల్యూడీ రోడ్డు వరకు, ఖాసీంకుంట కట్టపై రూ.3.30 లక్షలతో మొరం పోసి బాగు చేశారు.
తండాల పరిశుభ్రతకు చర్యలు
సంట్రకుంటతండా, నాన్యానాయక్తండాల్లో ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. నర్సరీని ఏర్పాటు చేసి అందులో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సంట్రకుంటతండా, నాన్యానాయక్ తండాల నుంచి కోస్గి రోడ్డు వరకు ఇరువైపులా హరితహారంలో మొక్కలు నాటి, వాటి చుట్టూ రక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేసి కాపాడుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తండాల్లో ప్రజలు శ్రమదానం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా చేశారు. రహదారులు, వీధులు, ఇండ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించారు. ఇంటి పరిసరాల్లోని పెంటకుప్పలను తొలగించారు. తడి, పొడి చెత్త సేకరణకు మహిళలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా 33 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. మిషన్ భగీరథ పథకంలో రెండు తండాల్లో ఓహెచ్ఏఆర్ ట్యాంకులు నిర్మించారు. పంచాయతీల్లోని అన్ని ఇండ్లకు మంచినీటిని అందిస్తున్నారు.
పల్లె ప్రగతితో ఎంతో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చిన తరువాత తండాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో పాటు పల్లె ప్రగతి నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేస్తున్నాం. హరితహారంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచుతున్నాం. తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం అవసరం ఉంది. ఎమ్మెల్యే సహకారంతో వీటిని మంజూరు చేయిస్తా.