e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home రంగారెడ్డి సకల హంగులతో సర్కారు విద్య

సకల హంగులతో సర్కారు విద్య

  • కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతులు
  • నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన
  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు క్యూ
  • ఈ నెలాఖరుతో ముగియనున్న ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు
  • గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భారీగా పెరిగిన విద్యార్థులు
  • ఇప్పటివరకు 3578 మంది చేరిక
  • కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులు

రంగారెడ్డి, జూలై 13, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జూనియర్‌ కాలేజీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో ఈ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీల్లో కంటే నిష్ణాతులైన అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉండడం, సొంత భవనాలు ఉండడం, ఉచిత విద్య, పుస్తకాలు తదితర వసతులు కల్పిస్తుండడంతో తిరిగి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల వైపు అడుగులు వేస్తున్నారు. గత రెండేండ్లుగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండడం, ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు మాత్రం తరగతులు లేకున్నా మొత్తం ఫీజులు వసూలు చేస్తుండడంతో కూడా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే 500లకుపైగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరడం గమనార్హం. అడ్మిషన్లు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. జిల్లావ్యాప్తంగా 17 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి.

మెరుగైన ఫలితాలు
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గతేడాది జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 3000 ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు విద్యార్థుల సంఖ్య 3578కి పెరిగింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలేజీల్లో చేర్చుకోవడం, అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా అందజేయడం, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ల్యాబ్‌ మెటీరియల్‌ అందజేయడం, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానంతో రోజురోజుకూ విద్యార్థుల శాతం పెరుగుతున్నది. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. మూడేండ్లుగా ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను లెక్చరర్లు దత్తత తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు. ఏ సబ్జెక్టులో అయితే ఉత్తీర్ణత శాతం తక్కువ వస్తుందో సంబంధిత లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ప్రతి కాలేజీలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్‌ కాలేజీల కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. ప్రస్తుతం విద్యార్థులకు కరోనా వైరస్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించారు.

- Advertisement -

ఇప్పటివరకు 3578 మంది విద్యార్థులు చేరిక
జిల్లాలోని 17 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గతేడాది 3 వేల మంది ఉండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 3578 మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఆయా కోర్సుల్లో చేరారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 238, శంషాబాద్‌ 82, మహేశ్వరం 181, రాజేంద్రనగర్‌ 469, బీహెచ్‌ఈఎల్‌ 420, రాయదుర్గం 334, యాచారం 135, కందుకూరు 112, కొత్తపేట 66, షాద్‌నగర్‌ 257, మొగిలిగిద్ద 65, ఆమనగల్లు 153, మాడ్గుల 103, ఇబ్రహీంపట్నం 201, మంచాల 96, సరూర్‌నగర్‌ 367, హయత్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 299 మంది విద్యార్థులు చేరారు. కాలేజీల్లో డిజిటల్‌ తరగతులను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే జిల్లాలోని 6 కాలేజీల్లో నిర్వహిస్తుండగా.. దశల వారీగా మిగతా అన్ని కాలేజీల్లో చేపట్టనున్నారు. డిజిటల్‌ బోధన విద్యార్థులకు సులభంగా అర్థం కావడంతోపాటు ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌ వంటి ప్రవేశ పరీక్షలకు కూడా ఉపయోగపడనుంది.

ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు:వెంక్యానాయక్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అన్ని రకాల మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నాం.

ప్రతి ఏటా విద్యార్థులు పెరుగుతున్నారు:అనురాధ, చేవెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌
ప్రతి ఏటా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేర్పించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉత్తీర్ణత శాతం కూడా పెంచేందుకు ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నాం. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇప్పటికే డిజిటల్‌ బోధన అమల్లోకి వచ్చింది. అడ్మిషన్లు పొందినవారికి టీ శాట్‌, దూరదర్శన్‌తోపాటు జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana