e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home రంగారెడ్డి పల్లె ప్రగతితో విశ్వనాథ్‌పూర్‌ అభివృద్ధి

పల్లె ప్రగతితో విశ్వనాథ్‌పూర్‌ అభివృద్ధి

 • అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం
 • ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
 • 5 వేలకు పైగా మొక్కల పెంపకం
 • నిత్యం చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ
 • వన నర్సరీలో 12 వేల మొక్కల సంరక్షణ
 • రూ. 12 లక్షల నిధులతో వైకుంఠధామం

షాద్‌నగర్‌, జూలై 19 : నాడు కనీస మౌలిక వసతులకు నోచుకోని పల్లెలు.. నేడు ప్రగతి వైపు పయనిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. ప్రభుత్వ నిధులను ఓ ప్రణాళిక ప్రకారం ఖర్చు చేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నది. మంచి నీటి సౌకర్యం, వైకుంఠధామాలు, చెత్త సేకరణ వాహనాలు, పారిశుధ్య నిర్వహణ కోసం సిబ్బంది ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాలువల శుభ్రత, పాడుబడిన బావుల పూడ్చివేత, చెత్త కుప్పలు, ముండ్ల పొదల తొలగింపు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం సమస్యల పరిష్కారం వంటి పనులను పూర్తిచేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా హరితహారం పథకంలో మొక్కలను పెంచుతున్నారు. దీంతో మారుమూల పల్లెలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు
కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులతో ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 1,082 జనాభా ఉన్నారు. 663 ఎకరాల విస్తీర్ణంలో గ్రామంతో పాటు రైతుల భూములు ఉన్నాయి. పల్లె ప్రగతి ప్రారంభం నాటినుంచి అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే కనీస మౌలిక వసతులు అందుబాటులోకి రావడంపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

నిధుల కేటాయింపు
విశ్వనాథ్‌పూర్‌ మారుమూల గ్రామం అయినప్పటికీ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. డంపింగ్‌ యార్డు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం నిర్మాణానికి రూ. 2.5 లక్షల నిధులను వెచ్చించారు. రూ. 1.82 లక్షల నిధులతో పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేసి సుమారు 5 వేల మొక్కలను పెంచుతున్నారు. అదనంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతియేటా వెయ్యి మొక్కలను నాటుతున్నారు. రూ. 20 లక్షల నిధులతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో నాలుగు సీసీ రోడ్లను నిర్మించారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా నూతనంగా వాటర్‌ ట్యాంక్‌ నిర్మించి 289 నల్లాల ద్వారా ఇంటింటికీ నీళ్లను సరఫరా చేస్తున్నారు.

నిత్యం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. రూ. 4.70 లక్షల నిధులతో నూతనంగా ట్రాక్టర్‌, రూ. 1.25 లక్షలతో నీటి ట్యాంకర్‌, రూ. 1.26 లక్షలతో ట్రాక్టర్‌ ట్రాలీని కొనుగోలుచేశారు. వన నర్సరీలో 12వేలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. ప్రతి యేటా కనీసం 2వేల 500లకు పైగా మొక్కలను నాటుతున్నారు. చెత్త డంపింగ్‌ యార్డులో సేంద్రియ ఎరువును తయారుచేసి హరితహారం మొక్కలకు వేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు పల్లె నిద్ర ద్వారా గ్రామ అభివృద్ధిని పరిశీలించారు. పల్లె ప్రగతితో గ్రామం పరిశుభ్రంగా మారిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలువడం ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ అవార్డు లభించింది.

నిత్యం పర్యవేక్షణ
పల్లె ప్రగతి ద్వారా గ్రామ ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించింది. గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. నిత్యం పారిశుధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ పనులను పర్యవేక్షిస్తాం. గ్రామ ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధి వైపు నడుస్తున్నది.

 • నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి
  ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
  గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ప్రోత్సాహంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నాం. గ్రామంలోని ప్రతి కాలనీకి సీసీ రోడ్లు నిర్మించాం. ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందుతున్నది. గ్రామంలో రోజు రోజుకూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతున్నాయి.
 • శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌, విశ్వనాథ్‌పూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana