e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home రంగారెడ్డి పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు

పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు

  • హరితహారంలో ఆదర్శం
  • ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు
  • అభివృద్ధిలో ముందంజ

యాచారం, జూలై 25 : పల్లె ప్రగతితో ఆ ఊరి రూపురేఖలన్ని మార్చేసింది. గతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ ఊరు ప్రస్తుతం సమస్యల చింతలేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మండలంలోనే మొక్కల పెంపకంలో ఆ గ్రామం ఆదర్శంగా అగ్రస్థానంలో నిలుస్తున్నది. వననర్సరీ, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పల్లె ప్రకృతివనం, అంతిమ వీడ్కోలు కోసం సకల సౌకర్యాలతో వైకుంఠధామం, తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి డంపింగ్‌యార్డు షెడ్‌ నిర్మాణం చేపట్టారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం మిషన్‌ భగీరథ ట్యాంకులు, నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు. అద్దంలా మెరిసే సీసీ రోడ్లు, ప్రధాన వీధుల్లో మిరుమిట్లు గొలిపే ఎల్‌ఈడీ బల్బులు, మురుగునీటి పారుదలకు చెక్‌ పెడుతూ అండర్‌ డ్రైనేజీ కాలువలు ఏర్పాటు, బహిరంగ మలవిసర్జన నిర్మూలనకోసం వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. తడి,పొడి చెత్త సేకరణ కోసం పంచాయతీ ట్రాక్టర్‌, మొక్కలకు నీరందించేందుకు నీటి ట్యాంకర్‌ ఇలా సకల సౌకర్యాలతో ఆ పంచాయతీ ప్రగతి బాటన పయనిస్తున్నది. గ్రామ సర్పంచ్‌ లిక్కి సరితతో పాటుగా పాలకవర్గం, అధికారుల పక్కా ప్రణాళిక, సమన్వయంతో మండలంలోనే చింతపట్ల గ్రామపంచాయతీ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది.

చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతివనం
గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో మొత్తం 2800ల మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి పనిదినాలతో ఆహ్లాదాన్ని పంచే పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 60రకాలతో కూడిన వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ, ఇతర మొక్కలు నాటారు. చట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. మొక్కలను బతికించేందుకు నిత్యం పంచాయతీ ట్యాంకర్‌తో నీరుపోసి రక్షిస్తున్నారు. చిట్టడవిని తలపించేలా మొక్కలను పెంచుతున్నారు.

- Advertisement -

మౌలిక సదుపాయాల్లో ముందంజ
చింతపట్ల గ్రామపంచాయతీ గతంలో అనేక సమస్యలకు నిలయంగా ఉండేది. పల్లెల రూపురేఖలను మార్చాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక వసతుల్లో ముందంజలో నిలిచింది. ఇప్పటికే గ్రామంలో పాడుబడి శిథిలావస్థకు చేరిన 150 ఇండ్లను కూల్చివేశారు. 2అతి పెద్ద పాడుబడిన పురాతన బావులను పూడ్చివేశారు. గుంతలను మట్టితో నింపి చదును చేశారు. పంచాయతీ సిబ్బంది రోడ్లు, వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లుతున్నారు. తాగునీరు, మంచినీరు, విద్యుత్‌, తదితర మౌలిక వసతులను కల్పించడంతో చింతపట్ల పంచాయతీ ముందు వరుసలో ఉంది.

పచ్చదనంతో ఆకట్టుకునేలా..
పచ్చదనాన్ని పెంపొందించేందకు గ్రామంలో మొత్తం 13,000ల మొక్కలను విరివిగా హరితహారం కార్యక్రమం ద్వారా నాటారు. కావలి నుంచి పెద్ద సైజు మొక్కలను దిగుమతి చేసుకొని కేవలం గ్రామానికి నలుదిక్కులా ఉన్న రోడ్లకు ఇరువైపులా నాటి వాటికి రంగులు వేసి సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధుల్లో మొక్కలు నాటారు. ఇండ్ల ముందు1500ల సీతాఫలాలు, 500 అల్లనేరడి, 1000 జామ, 500దానిమ్మ, 500 ఉసిరి మొక్కలతో పాటు ఆహ్లాదాన్ని పంచే వివిధ రకాల పూల మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి పెంచుతున్నారు. పచ్చదనంతో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నర్సరీలో మొక్కల పెంపకం
నర్సరీలో మొక్కలు పెంచేందుకు ప్రత్యేక నర్సరినీ ఏర్పాటు చేశారు. తీరొక్క రంగుల పూలు, పండ్లు, ఔషధ, ఇతర మొక్కల నారును నర్సరీ ద్వారా పెంచుతున్నారు. నర్సరీలో 8,000ల మొక్కలుగా పెంచి హరితహారం కింద నాటేందుకు సిద్ధం చేశారు.

సకల సౌకర్యాలతో వైకుంఠధామం
దహన సంస్కారాలు చేసేందుకు వైకుంఠధామాన్ని అన్ని రకాల వసతులతో రూ. 10.10లక్షలతో నిర్మించారు. స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గది, మరుగుదొడ్లు, శవాలను దింపేందుకు రెండు దింపుడు కల్లాలు, మంచినీరు, విద్యుత్‌ తదితర వసతులను ఏర్పాటు చేశారు.

స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
మిషన్‌ భగీరథ పథకం ద్వారా గ్రామంలో మొత్తం 3 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ ట్యాంకులున్నాయి. 800నల్లాల ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.

పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతి ద్వారా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. వార్డు సభ్యులు, అధికారుల సమష్టి కృషితోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. చింతపట్ల గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. పల్లె ప్రగతితో గ్రామంలో మునుపెన్నడు లేని విధంగా అన్ని సౌకర్యాలను సమకూర్చాం. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

  • లిక్కి సరిత, సర్పంచ్‌ చింతపట్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana