e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home రంగారెడ్డి నిండుకుండల్లా చెరువులు, ప్రాజెక్టులు

నిండుకుండల్లా చెరువులు, ప్రాజెక్టులు

  • అలుగులు పారుతున్న వాగులు
  • ఊపందుకున్న వ్యవసాయ పనులు
  • పలు గ్రామాల్లో కూలిన ఇండ్లు
  • పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు

పరిగి, జూలై 23: జిల్లాలో వరుసగా శుక్రవారం సైతం పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయం త్రం 7 గంటల వరకు జిల్లా పరిధిలోని పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌లో 67.0 మి.మీ, వికారాబాద్‌లో 52.8 మి.మీ, బంట్వారంలో 42.0 మి.మీ, కోట్‌పల్లిలో 37.8 మి.మీ, ధారూర్‌లో 36.5 మి.మీ, మదన్‌పల్లిలో 36.5 మి.మీ. మద్గుల్‌ చిట్టెంపల్లిలో 36.0 మి.మీ.ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 7.8 మి.మీ, మోమిన్‌పేట్‌లో 9.0 మి.మీ, నవాబుపేట్‌లో 8.8 మి.మీ, పూడూరులో 25.2 మి.మీ, పరిగిలో 14.0 మి.మీ, కులకచర్లలో 15.6 మి.మీ, దోమలో 12.0 మి.మీ, ధారూరులో 12.2 మి.మీ, తాండూరులో 8.8 మి.మీ, యాలాల్‌లో 3.4 మి.మీ, పెద్దేముల్‌లో 21.0 మి.మీ, బషీరాబాద్‌లో 5.8 మి.మీ, బొంరాస్‌పేట్‌లో 4.2 మి.మీ, కొడంగల్‌లో 6.2 మి.మీ, దౌల్తాబాద్‌లో 25.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.

తాండూరు నియోజకవర్గంలో..
వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో తాండూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇరిగేషన్‌ శాఖ అధీనంలోని 252 చెరువులు, కుంటల్లో నీరు నిండుగా చేరింది. తాండూరు కాగ్నానది, యాలాల పరిధిలోని కాకరవేణి నదితోపాటు జూంటుపల్లి, శివసాగర్‌ ప్రాజెక్టులు నిండి అలుగు పారుతున్నాయి. రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడికతీయడం, నీళ్లు వృథాగా పోకుండా కట్టలకు మట్టి వేయడంతో అవి నిండు కుండల్లా మారాయి. ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలకు ప్రత్యేక నిధులు కేటాయించి నీటి నిల్వ కోసం నిర్మాణాలు చేపట్టడంతో నీరు వృథాగా పోకుండా ఎక్కడికక్కడే నీరు నిలవడంతో జలకళ సంతరించుకున్నది. బోరు, బావుల్లో సైతం నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అలుగు పారుతున్న చిన్నవాగు ప్రాజెక్టు
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామానికి సమీపంలో ఉన్న చిన్నవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. మండలంలో శుక్రవారం 42 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ చెరువు కింద వందలాది ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. జూలైలోనే చెరువు నిండడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద వరి నాట్లు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మండలంలోని కొత్తూరు చెరువు కింద పంటల సాగుకు సర్పంచ్‌ మహేందర్‌ తూము నుంచి నీటిని విడుదల చేశారు. చెరువు నీటితో 320 ఎకరాల ఆయకట్టు సాగవుతుందన్నాని ఆయన తెలిపారు. ఆయనతో గ్రామస్తులు బాలప్ప, భీంరెడ్డి, రైతులు ఉన్నారు.

పొంగిపొర్లిన గాజీపూర్‌ వాగు
మండలంలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. మండలంలోని మారేపల్లి, తింసాన్‌పల్లి, నాగులపల్లి, ఇందూరు, ఆత్కూర్‌, తట్టేపల్లి, పాషాపూర్‌, అడికిచెర్ల, గొట్లపల్లి, హన్మాపూర్‌, గాజీపూర్‌, కందనెల్లితండా, బుద్దారం, బండపల్లి, కందనెల్లి, మంబాపూర్‌, జనగాం, పెద్దేముల్‌ తదితర గ్రామాల్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి మండలంలోని వాగులు, చెరువులు, కుంటలు, కాల్వలు వరద నీటితో నిండాయి. మండలంలోని గాజీపూర్‌ వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించే ఆయా గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

జోరుగా కలుపుతీత పనులు
వర్షాలతో వానకాలం పంటలు కళకళలాడుతున్నాయి. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మండలంలోని ఆయా గ్రామాల్లో పత్తి, కంది, మినుము, పెసర, మొక్కజొన్న పచ్చగా కనబడుతున్నాయి. శుక్రవారం వర్షం తెరిపినివ్వడంతో కంది, పత్తి పంటల్లో కలుపుతీత పనులు జోరుగా సాగుతున్నాయి. వర్షం ఇంతటితో ఆగిపోతే బాగుంటుందని అన్నదాతలు చెబుతున్నారు. నార్లు పోసిన రైతులు నాట్లు మొదలుపెట్టారు.

కాగ్నావాగుపై వంతెనకు మరమ్మతులు
మండలంలోని ధారూరు స్టేషన్‌ -దోర్నాల్‌ గ్రామాల మధ్య ఉన్న కాగ్నావాగు తాత్కాలిక వంతెనకు శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాత్కాలిక వంతెనపై వర్షపు నీరు పొంగిపొర్లడంతో దెబ్బతిన్నది. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగడంతో అధికారులు తాత్కాలిక వంతెనకు మరమ్మతులు చేయించారు.

వర్షానికి కూలిన ఇల్లు
నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని కరీంపూర్‌ గ్రామానికి చెందిన మరియమ్మ ఇల్లు గోడ కూలింది. దీంతో ఆమె ఇబ్బందులకు గురవుతున్నది. ఈ విషయంలో స్పందించి సర్పంచ్‌ అనిల్‌కుమార్‌ బాధితురాలికి రూ.5వేలు అందించి ఆర్థిక సాయం అంజేశారు.

వర్షానికి కూలిన నాలుగు ఇండ్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలుగు ఇండ్లు కూలాయి. తాండూరు మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో ప్రకాశ్‌, షబ్బీర్‌మియా, ఖాసీంల ఇండ్లతోపాటు మరో పాత ఇల్లు కూలిపోయింది. కూలిన ఇండ్లకు నష్ట పరిహారం ఇప్పించి, బాధితులను ఆదుకోవాలని సర్పంచ్‌ జగదీశ్‌ కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana