e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home రంగారెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

  • పారుతున్న మూసీ, ఈసీ వాగులు
  • ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు భారీగా వరద నీరు
  • అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
  • కలెక్టరేట్‌ కార్యాలయంలోకంట్రోల్‌రూం ఏర్పాటు

రంగారెడ్డి, సెప్టెంబర్‌ 27, (నమస్తే తెలంగాణ) : తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో అత్యధికంగా 86.3 మి.మీ వర్షం కురవగా, మహేశ్వరం మండలం మంఖాల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో 95.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షంతో జిల్లా మీదుగా వెళ్లే మూసీ నదితోపాటు ఈసీ వాగు పారుతున్నాయి. మిగతా ప్రాంతాల్లోని వాగులు పారుతుండగా, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇబ్రహీంపట్నం మండలంలోని పెద్ద చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. తుఫాన్‌ దృష్ట్యా జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 506.6 మి.మీ కాగా, ఇప్పటివరకు 702 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 91.3 మి.మీ కాగా, 90.3 మి.మీ, జూలై మాసంలో సాధారణ వర్షపాతం 153 మి.మీ కాగా, 315.8 మి.మీ వర్షపాతం, ఆగస్టులో సాధారణ వర్షపాతం 140.9 మి.మీ కాగా, 147.9 మి.మీటర్లు, సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 121 మి.మీ కాగా, 148.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

వికారాబాద్‌ జిల్లాలో..
పరిగి, సెప్టెంబర్‌ 27 : వికారాబాద్‌ జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మర్పల్లిలో 13.3 మి.మీ., మోమిన్‌పేట్‌లో 7 మి.మీ., బంట్వారంలో 12.8 మి.మీ., కోట్‌పల్లిలో 9.5 మి.మీ, వికారాబాద్‌లో 19.8 మి.మీ, నవాబుపేట్‌లో 7 మి.మీ, ధారూరులో 9.5 మి.మీ, పూడూరులో 47.3 మి.మీ, పరిగిలో 16.3 మి.మీ, కులకచర్లలో 18.5 మి.మీ, బొంరాస్‌పేట్‌లో 11.3 మి.మీ, దౌల్తాబాద్‌లో 17 మి.మీ, కొడంగల్‌లో 14.8 మి.మీ, యాలాల్‌లో 10.5 మి.మీ, పెద్దేముల్‌లో 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

- Advertisement -

కడ్తాల్‌ మండలంలో..
కడ్తాల్‌, సెప్టెంబర్‌ 27 : కడ్తాల్‌ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. మండల కేంద్రంలోని గుర్లకుంట, దేవరాచెరువు, నాగిరెడ్డికుంట, ఉప్పారాశికుంట, రావిచేడ్‌ గ్రామంలోని నాగోని చెరువు అలుగుపారుతుండగా, చరికొండలోని గౌరమ్మ నిండింది.

వికారాబాద్‌ నియోజకవర్గంలో..
వికారాబాద్‌, సెప్టెంబర్‌ 27 : వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూరు, మోమిన్‌పేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లో చిరుజల్లులతో ప్రారంభమై మోస్తరు వర్షం కురువగా, వికారాబాద్‌లో భారీ వర్షం పడింది. ఆయా మండలాల్లోని వాగులు, కుంటలు అలుగు పారుతున్నాయి.

పెద్దేముల్‌ మండలంలో..
పెద్దేముల్‌, సెప్టెంబర్‌ 27 : మండలంలోని కందనెల్లితండా, గొట్లపల్లి, గాజీపూర్‌, బుద్దారం, పెద్దేముల్‌, కందనెల్లి, మంబాపూర్‌, రుక్మాపూర్‌, రేగొండి, మన్‌సాన్‌పల్లి, జనగాం, మారేపల్లి, తింసాన్‌పల్లి, గోపాల్‌పూర్‌, నాగులపల్లి, తట్టేపల్లి, అడికిచెర్ల, బండమీదిపల్లి, ఇందూరు, హన్మాపూర్‌, గిర్మాపూర్‌తోపాటు తదితర గ్రామాల్లో వర్షం కురిసింది.

బొంరాస్‌పేట మండలంలో..
బొంరాస్‌పేట, సెప్టెంబరు 27 : మండలంలోని వడిచెర్ల పెద్ద చెరువు అలుగు పారుతున్నది. సోమవారం మండలంలో 36.40 మి.మీ వర్షపాతం నమోదైంది.

చేవెళ్ల నియోజకవర్గంలో..
షాబాద్‌, సెప్టెంబర్‌ 27: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నాగరగూడ ఈసీ వాగు, శంకర్‌పల్లి మూసీ వాగులు భారీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి. షాబాద్‌ పహిల్వాన్‌ చెరువు మత్తడి దుంకుతున్నది.

పరిగి పట్టణ పరిధిలో..
పరిగి టౌన్‌, సెప్టెంబర్‌ 27 : పరిగి పట్టణ పరిధిలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో పట్టణ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.

తాండూరులో..
తాండూరు రూరల్‌, సెప్టెంబరు 27 : తాండూరులో సోమవారం భారీ వర్షం కురుసింది. తాండూరు టౌన్‌, రూరల్‌, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల మండలాల్లో కుండపోత వాన పడింది. తాండూరు – చించోలి రోడ్డు మార్గంలోని అల్లాపూర్‌ గ్రామ సమీపంలో రోడ్డు మధ్యలో పెద్ద గోతి ఏర్పడింది. దీంతో నాపరాయి లోడ్‌ లారీ గోతిలో కూరుకుపోయింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్‌ 27 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మంచాల్‌, యాచారం మండలాలతో పాటు అదిబట్ల, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల్లో చెరువులు కుంటలు నిండాయి. విద్యుత్‌ స్తంభాల వద్దకు పోకుండా, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నేడు స్కూళ్లకు సెలవు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రేపు కూడా వర్షాలు కురిసినట్లయితే ఎల్లుండి కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించడంపై రేపు నిర్ణయిస్తామని కలెక్టర్లు తెలిపారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు…
తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. గ్రామ స్థాయిలో గ్రామ బృందాలు, మండల స్థాయిలో మండల బృందాలు, మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు చేపట్టాం. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశాం. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-23230817 నెంబర్‌ను సంప్రదించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement