సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 30, 2020 , 03:32:58

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు
  • డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూపరాణి ఏకగ్రీవంగా ఎన్నిక
  • కరీంనగర్‌ను రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరంగా తీర్చిదిద్దుతాం
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • పారదర్శక పాలన అందించాలి: మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లంతా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకోగా, ముందుగా పాలకవర్గసభ్యులతో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రమాణం చేయించారు. అనంతరం ఎన్నికల పరిశీలకుడు అద్వైత్‌కుమార్‌తో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.


40 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతోపాటు ఆరుగురు ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. మేయర్‌ అభ్యర్థిగా సునీల్‌రావును 3వ డివిజన్‌ కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ ప్రతిపాదించగా, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ అర్ష కిరణ్మయి బలపరిచారు. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా చల్ల స్వరూపరాణిని 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఐలేందర్‌యాదవ్‌ ప్రతిపాదించగా, 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుదగోని మాధవి బలపరిచారు. మిగతా ఎవరూ పోటీలో లేకపోవడంతో మేయర్‌గా సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌గా స్వరూపరాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. 


వీరికి రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌ సుంకె రవిశంకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నిక అనంతరం మేయర్‌గా వై సునీల్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రక్రియ తర్వాత కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముందు జిల్లా కేంద్రంలోని శ్వేత హోటల్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌ను రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులందరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రేమతో నిధులు మంజూరు చేస్తున్నారని, రెండో పెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. 


ఈ విషయంలో తనకుకూడా ఎన్నో ఆలోచనలు ఉన్నాయని, వాటినన్నింటినీ పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని సూచించారు. పదవులు వచ్చాయని అహంకారానికి పోవద్దని, కార్పొరేటర్లందరినీ కలుపుకొని ముందుకు సాగాలని చెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణగౌడ్‌, సంతోష్‌కుమార్‌, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.