e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జిల్లాలు సిరిసిల్ల బ్రాండ్‌ విశ్వవ్యాప్తం కావాలి

సిరిసిల్ల బ్రాండ్‌ విశ్వవ్యాప్తం కావాలి

నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండాలి
సీఎం కేసీఆర్‌తోనే నేత కార్మికుల అభివృద్ధి
ఆరు నెలల్లో ప్రగతిలోకి గోకల్‌దాస్‌ కంపెనీ
ఇది ఆరంభమే.. 10 వేల మందికి ఉపాధి కల్పిస్తా
ఈ ప్రాంతప్రజల రుణం తీర్చుకుంటా
80 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు
త్వరలోనే చేనేత బీమా అమలు చేస్తాం
మున్సిపల్‌, ఐటీ, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌
పెద్దూర్‌ అపెరల్‌ పార్క్‌లో గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ కంపెనీ గార్మెంట్స్‌, అండ్‌ ఇన్నర్స్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్‌, జూలై 30 : ‘మేడిన్‌ సిరిసిల్ల బ్రాండ్‌ విశ్వవ్యాప్తం కావాలి.. నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండాలి’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిలషించారు. 16 ఏండ్లనాటి అపెరల్‌ పార్క్‌ కల ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే నెరవేరిందని చెప్పారు. సిరిసిల్లలో పరిశ్రమలు స్థాపించి 10 వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల బల్దియా పరిధిలోని పెద్దూర్‌ శివారులో రూ.23.58 కోట్లతో గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్న గార్మెంట్స్‌, అండ్‌ ఇన్నర్స్‌ ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 19వ వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభించి, కలెక్టరేట్‌ కార్యాలయంలో జౌళిశాఖ అధికారులు, వస్త్ర ఉత్పత్తి సంఘాల యజమానులతో సమావేశం.. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ముస్తాబాద్‌ మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

సిరిసిల్ల అపెరల్‌ పార్కులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేసే గుడ్డలు విశ్వవిపణిలో మేడిన్‌ సిరిసిల్ల బ్రాండ్‌ను చాటాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు ఆకాంక్షించారు. ఈ మేరకు సిరిసిల్ల బల్దియా పరిధిలోని పెద్దూరులోగల అపెరల్‌ పార్కులో గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్న గార్మెంట్‌, అండ్‌ ఇన్నర్స్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఉదయం 11:55 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి కంపెనీ ఎండీ సుమిర్‌ హిందూజా, అధికారులు, నేతలు స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడారు. అపెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల కల అని, 2005లో అప్పటి సీఎం వైఎస్సార్‌ ఈ ప్రాంతంలో అపెరల్‌ పార్క్‌ పెడతామని మాట ఇచ్చారని, స్వరాష్ట్రంలో కేసీఆర్‌ ఆ కలను సాకారం చేశారని చెప్పారు. అపెరల్‌ పార్కులో సమీప భవిష్యత్‌లో 10 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇందులో 80 శాతం మహిళలకు అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల నేతన్నలు నాడు దుర్భిక్ష పరిస్థితులను అనుభవించారని, ఇంటి యజమాని మగ్గం నడిపితే రూ.10-12 వేలు పొందేవారన్నారు. కానీ, ఇప్పుడు మంచిరోజులు వచ్చాయని బతుకమ్మ చీరెలు, స్కూల్‌ యూనిఫాం ఆర్డర్లతో కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందన్నారు. నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు సంపాదిస్తూ సంతోషంగా బతుకుతున్నారని తెలిపారు. అపెరల్‌ పార్కులోని యూనిట్ల ద్వారా మహిళలకు నెలకు రూ.12 వేల వేతనం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఆసక్తిగల వారికి రోజుకు 8 గంటల పనికల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దూరులో రాబోయే మూడేండ్లలో మరో రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు.

పత్తి సాగులో నంబర్‌ వన్‌
పత్తి సాగులో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌, వరిసాగులో ద్వితీయ స్థానాల్లో ఉన్నదని చెప్పారు. నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతుందని తమిళనాడుకు చెందిన సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోషియేషన్‌ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించిందని గు ర్తుచేశారు. ఇక్కడి నేలలు సారవంతమైనవని, ఈ విషయాన్ని గుర్తెరిగే సీఎం కేసీఆర్‌ జౌళిరంగానికి ప్రాముఖ్యతనిస్తూ టీటాప్‌ (తెలంగాణ టెక్స్‌టైల్‌ అండ్‌ అపరెల్‌) పాలసీని అమల్లోకి తెచ్చారన్నారు. దీని ద్వారా ఇతర దేశాల్లోని ముఖ్యమైన టెక్స్‌టైల్‌ కంపెనీలను కలిసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించామని చెప్పారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌లో యంగ్‌వన్‌ కంపెనీ ద్వారా దా దాపు 12వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

త్వరలోనే చేనేత బీమా
నేతన్నల సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్‌ త్వరలోనే చేనేత బీమా పథకానికి అంకురార్పణ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రైతు బీమా తరహాలో ఈ బృహత్తర పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలో చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల నేతన్నల కుటుంబాలకు రూ.110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని, పవర్‌ లూం, నేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 50 శాతం యార్న్‌ సబ్సిడీని ఇస్తున్నామనే విషయాన్ని గర్వంగా చెబుతున్నామన్నారు. రూ.వేల కోట్లతో సిరిసిల్ల, నల్గొం డ, గద్వాల, కాటేదాన్‌లో మరమగ్గాలను ఆధునీకరించామని చెప్పారు. సిరిసిల్లలో 50 శాతం సబ్సిడీతో కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఉరిశాల నుంచి సిరులు కురిపించే సిరిసిల్లగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో దేశంలోనే తక్కువగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయని స్వయంగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. పెద్దూరులో కంపెనీల ఏర్పాటుకు బీజం పడిందని, ఇక్కడ పలు యూనిట్లను ఏర్పా టు చేసి 10వేల మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతవాసుల రుణం తీర్చుకుంటామని పునరుద్ఘాటించారు. త్వరలోనే వర్క్‌టూ ఓనర్‌ స్కీంకు శ్రీకారం చుట్టనున్నామని, దీనికింద రూ.400 కోట్లతో షెడ్లను నిర్మిస్తామని తెలిపారు. కార్మికుడిని యజమానిగా చేసే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేశారని వెల్లడించారు.

హిందీలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం
గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ ఫ్యాక్టరీ భూమిపూజ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హిందీలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అపెరల్‌ పార్కులో మహిళలకు వసతుల కల్పనపై సంస్థ ఎండీ సుమిర్‌ హిందూజాకు హిందీలో తనదైన శైలిలో వివరించారు. అక్కడ టాయ్‌లెట్స్‌, పిల్లలకు ఆడుకునే విధంగా, బేబీ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సుమిర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యార్‌, టీఎస్‌ఐసీ ఎండీ నర్సింహారెడ్డి, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టెక్స్‌ టైల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తస్లీమా, ఏడీ అశోక్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఆర్‌బీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కళ, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్‌ సత్యనారాయణ, భూక్యా రెడ్యానాయక్‌ , తదితరులు పాల్గొన్నారు.

కుట్టు మిషన్ల పంపిణీ
నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న 27మంది మహిళలకు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అతివలు అన్నింటా ముందుండాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన 30 మంది దళిత మహిళలకు చెందిన 80.08 ఎకరాల భూమికి పంటసహాయం కింద రూ. 11. 70లక్షలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana