e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు జంటనగరాలుగా కార్మిక, ధార్మిక క్షేత్రాలు

జంటనగరాలుగా కార్మిక, ధార్మిక క్షేత్రాలు

రాబోయే రాజుల్లో మరింత అభివృద్ధి
జిల్లావాసులకు అధునాతన వైద్యం
కొత్తరేషన్‌ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సరుకులు
రిజర్వాయర్లతో చెరువులకు జలకళ
టూరిజం స్పాట్‌గా రామప్ప గుట్ట
చెక్‌డ్యాంల నిర్మాణం వేగవంతం చేయాలి
ఈ యేడాది నుంచే జేఎన్‌టీయూ తరగతులు
రైతులు వాణిజ్యపంటలపై దృష్టి పెట్టాలి
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టులు పెట్టాలి
రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల/ సిరిసిసిల్లటౌన్‌/ కలెక్టరేట్‌, జూలై 26 : కార్మిక క్షేత్రం సిరిసిల్ల, ధార్మిక క్షేత్రం వేములవాడ.. ఇవి రెండూ రానున్న రోజుల్లో జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ప్రభుత్వ దవాఖానలో రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్‌ కేంద్రం, కలెక్టరేట్‌లో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డేతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిలో ఉన్న పనులు, తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.

- Advertisement -

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించడంతోపాటు సేకరించి మోడల్‌ కాలనీలను నిర్మించాలని మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే భవిష్యత్తులో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా మధ్యాహ్నం 12:05 గంటలకు తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులపల్లిలో బొంగరపు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. 12:55 గంటలకు జిల్లా దవాఖానలోని రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. 1:30 గంటలకు 34వ వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచి 2:20 గంటలకు కలెక్టరేట్‌లో కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం అక్కడే జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి సాయంత్రం 7:10 నిమిషాలకు ముస్తాబాద్‌ మండలానికి బయలుదేరారు.

స్‌ఆర్‌ఆర్‌, అన్నపూర్ణ ద్వారా చెరువులకు నీరు
ఎగువమానేరు, ఎస్‌ఆర్‌ఆర్‌, అన్నపూర్ణ రిజర్వాయర్‌ల ద్వారా జిల్లాలోని 665 చెరువులను నింపే బృహత్తర కార్యక్రమం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఇప్పటికే 165 చెరువులు నింపినట్లు తెలిపారు. ప్రగతిలో ఉన్న 24 చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించగా, 9 ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు వివరించారు. వానకాలం సాగు వివరాలు ఎలా ఉన్నాయంటూ వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. లక్షా 59 వేల 247 ఎకరాల్లో సాగవుతున్నట్లు మంత్రికి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. అయిల్‌పాం, వివిధ రకాల సంప్రదాయ, సంప్రదాయేతర, వాణిజ్య పంటల సాగుపై రైతువేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయా? లేవా? అంటూ ఆరా తీశారు. పోలీస్‌, వ్యవసాయశాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రగతిలో ఉన్న 6 వేల పైచిలుకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, పట్టణాలలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని సూచించారు. ఒకప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌, సాగు, తాగునీటి సమస్యలు విపరీతంగా ఉండేవని నేడు అన్నీ పరిష్కారం అయ్యాయంటూ ప్రత్యక్షంగా ప్రజలే చెబుతున్నారని తెలిపారు.

మరమ్మతులు చేపట్టాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో నష్టపోయిన రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్‌ఫూర్‌ వంతెనకు నిధులు మంజూరు చేశామని, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హన్మాజీపేటలో వంతెన నిర్మాణానికి అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. వేములవాడలో ప్రగతిలో ఉన్న రెండో బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని, తిప్పాపూర్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వంద శాతం మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగు, సాగు నీరు, విద్యుత్‌ సమస్యలు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఇవి లేవని ప్రత్యక్షంగా ప్రజలే చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేయాలని, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాలో భూగర్భజలాలు ఎన్ని మీటర్ల మేర ఉన్నాయో సర్వే చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ ఏడాది నుంచే జేఎన్‌టీయూ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తాత్కాలికంగా అగ్రహారంలోని డిగ్రీ కళాశాలలో తరగతులు నిర్వహించాలని సూచించారు. కళాశాల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని, రానున్న విడతలో జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేసేలా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. రాజరాజేశ్వర జలాశయం బ్యాక్‌వాటర్‌ సమీపంలో రామప్ప గుట్టను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని, అక్కడి నుంచి నాంపల్లి గుట్టకు అనుసంధానంగా వంతెన నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. పల్లె ప్రగతితో ప్రతి గ్రామం సుందరంగా మారిందని తెలిపారు. వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డ్‌లు, కంపోస్ట్‌షెడ్‌లతో అభివృద్ధి చేసినట్లు వివరించారు, కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, పీఆఆర్‌ ఈఈ శ్రీనివాస రావు, 9వ ప్యాకేజీ ఈఈ శ్రీనివాస రెడ్డి, మిషన్‌భగీరథ ఈఈలు జానకి, విజయ్‌కుమార్‌, అధికారులు ఉన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా సీటీ స్కానింగ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక దవాఖానలో ఉచితంగా ఏర్పాటు చేశామని, కార్పొరేటు దవాఖానలకు దీటుగా అంతటి సేవలు అందిస్తున్నామని తెలిపారు.

సాంకేతికతతో గస్తీ
సాంకేతిక పరిజ్ఞానంతో కాలనీల్లో డేగ కన్నులా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలోని 34వ వార్డులో స్థానిక కౌన్సిలర్‌ దార్ల కీర్తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. సిరిసిల్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తొలి వార్డు ఇదేనని కౌన్సిలర్‌ను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని అన్ని వార్డుల్లో వందశాతం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి కౌన్సిలర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.అనంతరం పలువురి కుటుంబాలను పరామర్శించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు
అర్హులందరికీ రేషన్‌కార్డులను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్డుల పంపిణీ అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల నుంచి అర్హులైన లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, నాఫ్స్‌కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు చేతుల మీదుగా రేషన్‌కార్డులను అందించారు.

అనాథలకు ఆర్థికసాయం
జిల్లాలో కొవిడ్‌ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన ఇరువురికి మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం అందించారు. గంభీరావుపేట మండలం గోరంట్యాలకు చెందిన రిష్వంత్‌వర్ధన్‌కు, ముస్తాబాద్‌ మండలం అవునూర్‌కు చెందిన సౌళ్ల అశ్విత్‌కు చెరో రూ.50 వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, సిరిసిల్ల, వేములవాడ చైర్‌ పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, జిల్లా డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడురు ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా బాధ్యులు తోట ఆగయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, జిల్లా ఆర్‌బీఎస్‌ జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచ శ్రీనివాస్‌, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు వివిధ శాఖలఅ ధికారులు, పాల్గొన్నారు.

అండగా ఉంటాం .. అధైర్యపడవద్దు
సిరిసిల్ల రూరల్‌, జూలై 26 : కరోనా ప్రపంచాన్నే తలకిందులుచేసిందని, కరోనాతో టీఆర్‌ఎస్‌ తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మృతి చెందడం బాధాకరమని, అధైర్య పడవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఐటీపురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన కుటుంబాన్ని సోమవారం మంత్రి పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో నేలపై కూర్చొని శ్రీనివాసరెడ్డి మృతికిగల కారణాలు తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలని వారికి సూచించారు. శ్రీనివాస్‌రెడ్డి కొడుకు సిద్దిపేటలో పనిచేస్తున్నారని తెలపడంతో, స్థానికంగానే ఉద్యోగంలో పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి భార్యకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana