బుధవారం 03 మార్చి 2021
Rajanna-siricilla - Feb 23, 2021 , 03:14:00

పోలీసులకు చిక్కిన అంతర్‌ జిల్లా దొంగలు

పోలీసులకు చిక్కిన అంతర్‌ జిల్లా దొంగలు

  • ఇండ్లు, గుడులే లక్ష్యంగా చోరీలు
  • రూ.25వేల నగదు, రూ.1.83 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
  • విలేకరుల సమావేశంలో రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే వెల్లడి

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 22: ఇండ్లు, గుడులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు చిక్కారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివరాలను వెల్లడించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన కొలిపాక రాజు (43) జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడ్డాడు. ఇండ్లు, గుడులకు కన్నాలు వేసి, సొమ్ము, సొత్తు ఎత్తుకెళ్లాడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌, జమ్మికుంట, వరంగల్‌ మట్టెవాడ ఏరియాల్లో దొంగతనాలు చేసి అనేక సార్లు జైలుకి వెళ్లి వచ్చాడు. తరువాత కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన దుంప అలియాస్‌ షేక్‌ మంజులతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. వీరు మోటార్‌ సైకిల్‌పై తిరుగుతూ వేములవాడ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కొదురుపాక, కోనాయిపల్లి, మర్రిపల్లి, మల్లారం గ్రామాల శివారుల్లోని గుడుల్లో దొంగతనాలు చేశారు. హుండీల్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోతుండగా, సోమవారం ఉదయం వేములవాడ రూరల్‌ ఎస్‌ఐ మాలకొండ నాయుడు శాత్రాజుపల్లి రోడ్డులో సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఠాణాకు తరలించి, విచారించగా నేరాలను అంగీకరించారు. నిందితులపై వేములవాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు, బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. వారి నుంచి రూ. 25వేల నగదు, మోటార్‌ సైకిల్‌ (సీడీ 100), రూ.1.83 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌, సీఐ వెంకటేశ్‌, ఎస్‌ఐ మాలకొండ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo