బుధవారం 24 ఫిబ్రవరి 2021
Rajanna-siricilla - Jan 27, 2021 , 03:00:42

జలస్వప్నం సాకారం

జలస్వప్నం సాకారం

  • జిల్లాలో పండుగలా వ్యవసాయం 
  • అభివృద్ధి, సంక్షేమంలోనూ ముందున్నాం
  • శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు భేష్‌  
  • ధార్మిక క్షేత్ర అభివృద్ధికి 400 కోట్లు 
  • సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

 రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తేతెలంగాణ): ‘స్వరాష్ట్రంలోనే జల స్వప్నం సాకారమైంది. మధ్యమానేరు ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అఖిలభారత సర్వీస్‌ అధికారులకు అధ్యయన అంశంగా జిల్లా నిలువడం మనకెంతో గర్వకారణమని’ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. మరమగ్గాల కార్మికుడిని యజమానిగా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్‌ టూ ఓనర్‌ పథకం ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా ముందున్నదని, ఇందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తున్నదని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మధ్యమానేరు నుంచి ఎగువ మానేరుకు నీటిని ఎత్తిపోయడం ద్వారా జిల్లాలో 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత ప్రభుత్వానికే దక్కిందని కొనియాడారు. జిల్లాలో 2,27,410 మంది రైతులకు రైతుబంధు కింద 257.28కోట్ల పెట్టుబడి సాయం అందించామని, 771 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా కింద 38.55 కోట్లు చెల్లించామని వెల్లడించారు. 11.74 కోట్లతో జిల్లాలో నిర్మించిన 57 రైతుభవనాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. 13మండలాల్లోని 359 ఆవాసాలకు, 5.50లక్షల మంది ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా నీరందిస్తున్నామన్నారు. ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు సిరిసిల్లలో 159 కోట్లతో 300 పడకల దవాఖాన, 22.50 కోట్లతో వేములవాడలో 100 పడకల దవాఖాన నిర్మిస్తున్నామని, 64.70కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో 100 కోట్లతో ప్రగతి పనులు పూర్తయ్యాయని, 255 గ్రామ పంచాయతీల్లో 175వైకుంఠధామాలు, 267పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక 22 కోట్లతో 436 ఎకరాలు కొనుగోలు చేసి షెడ్యూల్‌ కులాలకు చెందిన 165 మందికి పంపిణీ చేశామన్నారు. 400 కోట్లతో రాజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, సిరిసిల్ల ప్రజల చిరకాల స్వప్నమైన రైలు కూత వినిపించేందుకు భూసేకరణ వేగంగా సాగుతున్నదని వెల్లడించారు. 2వేల కోట్ల బతుకమ్మ చీరలు, క్రిస్మస్‌, రంజాన్‌, యూనిఫాంల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తూ మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని చెప్పారు. 65కోట్లతో 10వేల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపెరల్‌ పార్కు, 250కోట్లతో కార్మికుడినే యజమానిగా మార్చే వర్క్‌ టూ ఓనర్‌ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. వేడుకల్లో ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అదనపు కలెక్టర్‌ అంజయ్య, రిజ్వాన్‌ బాషా, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఆర్డీవో శ్రీనివాస్‌ రావు పాల్గొన్నారు.

VIDEOS

logo