జయహే..

- ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
- వాడవాడనా త్రివర్ణ పతాక రెపరెపలు
- జెండాలు ఎగురవేసిన మంత్రి గంగుల, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
- స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
- ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు
- ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాళ్లు
- ప్రత్యేక ఆకర్షణగా మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లు
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జనవరి 26: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఎస్పీ రాహుల్‌హెగ్డేతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సంక్షేమ, జౌళి, మున్సిపల్, మత్స్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, వైద్యఆరోగ్య, అటవీ, వెటర్నరీ, మిషన్ భగీరథ, ఎస్సీ కార్పొరేషన్, ఆయా ప్రభుత్వ పథకాలతో స్టాళ్లను ఏర్పాటు చేయగా, అధికారులు సందర్శించారు. మిషన్‌భగీరథ స్టాల్ వద్ద బాటిళ్లలో ఏర్పాటు చేసిన నీటిని తాగారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వితంతువుల స్వయం ఉపాధికి గాను పది మందికి 50 వేల చొప్పున అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ కౌటిల్యారెడ్డి జిల్లాలోని 478 స్వయం సహాయక సంఘాలకు 30 కోట్ల రుణాలను అందించారు. 145 మంది అధికారులు, ఉద్యోగులకు జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్, ఎస్పీతో కలిసి ప్రశంసా పత్రాలు అందించారు. అన్ని చోట్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల జాతీయ వేదిక అధ్యక్షుడు, బోవెరా సంస్థల జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు, తదితరులు హాజరయ్యారు.