మంగళవారం 02 మార్చి 2021
Rajanna-siricilla - Jan 17, 2021 , 03:47:13

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

  • సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే
  • జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం

సిరిసిల్ల రూరల్‌, జనవరి 16: ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదట పోలీస్‌స్టేషన్ల వారీగా గతంలో నమోదైన కేసులు, పెండింగ్‌ కేసుల్లో గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసుల వివరాలను తెలుసుకున్నారు. శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్‌ కేసుల వివరాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. డయల్‌ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని, స్పందించిన సమయాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ పెట్టి కేసులు, ఈ చలాన్‌ కేసుల ద్వారా నేర తీవ్రత తగ్గించవచ్చని, చిన్నచిన్న నేరాలపై ఈ పెట్టి కేసులను నమోదు చేయాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌, బ్లూకోల్ట్స్‌, పెట్రో కార్స్‌, కోర్టు డ్యూటీ, డయల్‌ 100ను సెక్షన్‌ ఇన్‌చార్జి నిరంతరం పర్యవేక్షించాలన్నా రు. ఆస్తి సంబంధిత నేరాలు, అక్రమ ఇసుక రవాణా, మహిళా సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారీగా వాహనాల తనిఖీ చేపట్టి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనపై చట్ట ప్రకారం  చర్యలు తీసుకోవాలన్నారు. డయల్‌ 100, మూఢ నమ్మకాలు, ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రత నియమాలు, సైబర్‌ నేరాలకు సంబంధించిన చట్టాలు, ఆత్మహత్యలు, చెడు అలవాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తరచుగా నేరాలకు పాల్పడుతున్నవారి జాబితాను సిద్ధం చేసి, పీడీ యాక్ట్‌ అమలు పరచడానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది ఉన్నారు.


VIDEOS

logo