న్యూఢిల్లీ: సూర్యుడి కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత దాదాపు 3 కోట్ల డిగ్రీల సెల్సియస్. చైనా తయారుచేస్తున్న కృత్రిమ సూర్యుడిలో ఉపయోగించే కేంద్రక సంలీన రియాక్టర్ ఇటీవల సృష్టించిన ఉష్ణోగ్రత 16 కోట్ల డిగ్రీల సెల్సియస్. కృత్రిమ సూర్యుడి తయారీలో చైనా మరో రికార్డు సాధించింది. ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్(ఈస్ట్) లోని రియాక్టర్ 20 సెకన్ల పాటు 16 కోట్ల డిగ్రీల ప్లాస్మా ఉష్ణోగ్రతను అందుకొన్నది. 101 సెకన్ల పాటు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అందుకొన్నది.గతంలో ఇది 10 కోట్ల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టించింది. సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీన ప్రక్రియ వల్ల ఉష్ణం జనిస్తుంది.