మంగళవారం 19 జనవరి 2021
Rajanna-siricilla - Dec 06, 2020 , 01:20:32

ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటరుగా నమోదు చేసుకోవాలి

రుద్రంగి: 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచించారు. తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బూత్‌ లెవల్‌ అధికారులతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓటు హక్కు లేనివారు నమోదు చేసుకునేందుకు, జాబితాలో ఉన్న పేర్లలో తప్పులుంటే సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఓటరు నమోదు చేసుకునేందుకు బూత్‌ పరిధిలోని బీఎల్‌వోలు, తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ ఓటరు నమోదు పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌, ఆర్‌ఐ సునీత, వీఆర్వో నారాయణ, బూత్‌ లెవల్‌ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

సద్వినియోగం చేసుకోవాలి

చందుర్తి: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. మూడపల్లి, మర్రగడ్డ, చందుర్తిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన శనివారం పరిశీలించి, మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో తహసీల్దార్‌ నరేశ్‌, సర్పంచులు, రెవెన్యూ సిబ్బంది, బూత్‌ లెవల్‌ అధికారులు ఉన్నారు. 

ఓటరు నమోదు తీరు పరిశీలన

వేములవాడ రూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లి, నాగయ్యపల్లిలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, ఎన్నికల కమిషన్‌ ఓటరు నమోదు పరిశీలకుడు వీరబ్రహ్మయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంతో అత్యంత ప్రధానమైనది ఓటు హక్కు అని స్పష్టం చేశారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నక్క శ్రీనివాస్‌, ఆర్‌ఐ సతీశ్‌ ఉన్నారు. 

రాజన్న సన్నిధిలో పూజలు

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, ఎన్నిక ల కమిషన్‌ ఓటరు నమోదు పరిశీలకుడు ఎం.వీరబ్రహ్మ య్య శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో  స్వామివారికి పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో  స్థానాచార్యులు  భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.