ఆపన్నులకు అభయం

- పేదలకు అండగా వేములవాడ మిలీనియం ఫౌండేషన్
- కష్టాల్లో ఉన్నవారికి నగదు సాయంతో చేయూత
- ఆదర్శంగా నిలుస్తున్న జవహర్లాల్ నెహ్రూ స్కూల్పూర్వ విద్యార్థులు
వారి పథం.. ప్రజల హితం..
సమాజ సేవే వారి అభిమతం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమంటే చాలా ఇష్టం. పేదప్రజలకు ఏదైనా చేయాలని సంకల్పించారు. అంతా ఏకమై మిలీనియం ఫౌండేషన్ స్థాపించి పేదలకు బాసటగా నిలుస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 130 మంది సంఘటితమై ముందుకు సాగుతున్నారు. ప్రతి నెలా కొంత సొమ్మును పోగు చేస్తూ ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వేములవాడ జవహర్లాల్ నెహ్రూ స్కూల్ పూర్వ విద్యార్థులపై ‘నమస్తే’ కథనం.
వేములవాడ: వారంతా వేములవాడ పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ పాఠశాల పూర్వ విద్యార్థులు. ఒకరుకాదు ఇద్దరు కాదు దాదాపు 30 మంది. 2000-01 పదో తరగతి బ్యాచ్ పూర్తిచేశారు. అందులో కొందరు ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ, ప్రైవేట్ కొలువులు చేస్తుండగా, మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో 2018లో స్థానికంగా ‘గెట్ టూ గెదర్' కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అంతా ఒక ఆలోచన చేసి కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలని, ఆపన్న హస్తం అందించాలని సంకల్పించారు. ఈ క్రమంలో మిలీనియం పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సభ్యులందరూ ప్రతినెలా తమకు తోచినంత 200 నుంచి 500 దాకా ఫౌండేషన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకుంటూ తమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆర్థిక చేయూతను అందిస్తూ..
పేదలకు సాయం చేయాలని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులు, తొలుత స్నేహితుడి కుటుంబానికే సాయం చేశారు. చిన్ననాటి మిత్రుడు వడ్డెపల్లి జనార్ధన్ 2019లో ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. జనార్ధన్ కుటుంబానికి 50వేల ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారానికి 26,550, చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన చిన్నారి కిరీటి చికిత్స కోసం 10వేలు, కరోనా కాలంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు వేములవాడ పురపాలక సంఘం చేపట్టిన అన్నపూర్ణ పథకానికి 15వేలు, విద్యుత్ షాక్‌తో కాలు కోల్పోయిన నాంపల్లికి చెందిన అలువాల రాజుకు 10వేలు, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బోయినిపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన నవీన్‌కు 10వేలు, అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతిక అనే అమ్మాయికి 10వేలు, ఇటీవల నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పొన్నం నవీన్ కుటుంబానికి 15వేలు అందజేశారు. ఇలా చాలా మందికి సాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
సేవే పరమావధి..
సేవే పరమావధి. ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ దొరకదు. కష్టాల్లో ఉన్నవారికి మా వంతు బాధ్యతగా భరోసా కల్పిస్తున్నాం. 2018లో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటగా మా స్నేహితుని కుటుంబానికే ఆర్థిక సాయం చేశాం. అప్పటి నుంచే ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా అమలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు చాలా మందికి బాసటగా నిలిచాం.
- తోట ఆంజనేయులు, సీఏ, మిలీనియం ఫౌండేషన్ అధ్యక్షుడు, వేములవాడ
తాజావార్తలు
- వర్మ `డీ కంపెనీ` టీజర్ చూశారా?
- 'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'
- ముత్తూట్ ఫైనాన్స్ చోరీ గుట్టురట్టు:
- మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
- పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా