శనివారం 23 జనవరి 2021
Rajanna-siricilla - Dec 04, 2020 , 01:19:07

‘సెస్‌' ఎన్నికలకు సన్నద్ధం కావాలి

‘సెస్‌' ఎన్నికలకు సన్నద్ధం కావాలి

  • విజయం కోసం పట్టుదలతో పనిచేయాలి
  • త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ 
  • మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌
  • రాజన్న సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన
  • పార్టీ కార్యాలయం పరిశీలన, నాయకులతో సమీక్ష

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: సిరిసిల్ల సహకార విద్యుత్‌ సంస్థ (సెస్‌) ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. గురువారం సిరిసిల్ల పట్టణంలో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు సిరిసిల్లకు చేరుకొని రగుడు వద్ద నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం (ప్రగతి భవన్‌)ను టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, పార్టీ అధికార ప్రతినిధి తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణితో కలిసి సందర్శించారు. భవన సముదాయాన్ని పరిశీలించి, 12.40 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని, పార్టీ మండల శాఖ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో సమావేశమయ్యారు. 

అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి 

సెస్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని, అభ్యర్థుల ఎంపిక వెంటనే చేపట్టాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థుల విజయంలో కార్యకర్తల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సైతం సిరిసిల్ల నియోజకవర్గ, జిల్లా కార్యకర్తలు ఇంటింటా చేసిన ప్రచారం అభినందనీయన్నారు. ఎన్నికలు ఏవైనా అభ్యర్థులను గెలిపిస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సెస్‌ ఎన్నికల్లోనూ గెలుపు కోసం పట్టుదలతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో, పట్టణంలోని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని, స్థానిక నాయకులతో అయినవి అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. కార్యకర్తలు ప్రజల మధ్యన ఉండి పనిచేయాలన్నారు. ప్రగతి భవన్‌ ప్రారంభించిన తర్వాత పార్టీ సమావేశాలన్నీ ఇక నుంచి అందులోనే జరగాలన్నారు. భవన నిర్మాణం పూర్తయినందుకు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పార్టీ పక్కన నిర్మిస్తున్న కల్యాణ మండపంలో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పార్టీ కార్యకర్తలకు, పేదలకు అందుబాటులో ఉండేలా ధర నిర్ణయించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పారు. 

త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ 

పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. త్వరలో నామినేటెడ్‌ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతి మండలంలో పార్టీ కార్యాలయాల కోసం వంద గజాల స్థలం కొనుగోలు చే యాలని పార్టీ మండలాధ్యక్షులకు సూచించారు. ఇక అనాథలను పట్టించుకోకపోవడం వల్ల వారు పడుతున్న బాధల గురించి పత్రికలలో వస్తున్న కథనాలు తననెంతో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో తన సొంత ఖర్చులతో అనాథాశ్రమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకు అనువైన స్థలాలను చూడాలని ఆదేశించారు. 

పర్యాటక కేంద్రంగా మానేరు.. 

కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న సిరిసిల్ల మానేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, వరంగల్‌లోని భద్రకాళీ ఆలయ చెరువు తరహాలో కరకట్టను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానేరు బ్రిడ్జి నుంచి రగుడు చౌరస్తా దాకా రూ.36కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని వచ్చే శివరాత్రిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. 

ఏఎంసీ చైర్మన్లు వీరే

సిరిసిల్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను మంత్రి ప్రకటించారు. సిరిసిల్ల చైర్మన్‌గా రవీందర్‌రెడ్డి(అంకిరెడ్డిపల్లె), కొండ రమేశ్‌ (ఎల్లారెడ్డిపేట), జనాబాయి (ముస్తాబాద్‌), బాలవ్వ (గంభీరావుపేట) ఉన్నారు. సమావేశంలో రైతు బంధు స మితి మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, మండలాల పార్టీ అధ్యక్షులు న్యాలకొండ రాఘవరెడ్డి, గజభీంకా ర్‌ రాజన్న, సురేందర్‌రావు, పాపగారి వెంకటస్వామిగౌ డ్‌, వలస కృష్ణహరి, రాజిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీ నివాస్‌, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ బండి దేవదాస్‌, కార్యకర్తలు, సీనియర్‌ నాయకులు ఉన్నారు.

ఆప్యాయంగా పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ 

గ్రేటర్‌ ఎన్నికల తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు కార్యకర్తలు, సీనియర్‌ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కార్యకర్తలతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు  సమావేశం నిర్వహించిన మంత్రి, మీటింగ్‌ ముగిసిన వెంటనే తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎలాంటి హంగూ ఆర్భాటం, పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలు లేకుండానే మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో పర్యటించారు. మూడున్నర గంటల పాటు కార్యకర్తలు, నాయకులు, అధికారులు, అభిమానులతో ఉన్న ఆయన, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.


logo