ఆదివారం 17 జనవరి 2021
Rajanna-siricilla - Nov 28, 2020 , 01:52:48

ఏండ్ల కల నెరవేరుతున్న వేళ..

ఏండ్ల కల నెరవేరుతున్న వేళ..

  • కంకర తేలిన రోడ్లకు బీటీ సొబగులు
  • ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషితో డబుల్‌రోడ్డు
  • రూ.8.89కోట్ల పనులు పూర్తి.. మరో 4.3కోట్ల నిధులు మంజూరు
  • చురుగ్గా సాగుతున్న పనులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణులు

మొన్నటి వరకు కంకర తేలి అధ్వానంగా మారిన రోడ్లకు మహర్దశ వస్తున్నది. అడుగుకో గుంత, మట్టి, దుబ్బలో ప్రయాణం నరకంగా మారిన మార్గాల్లో నేడు బీటీ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంతో గ్రామీణ రోడ్లు అద్దాల్లా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

-కోనరావుపేట 

రాష్ట్ర ఏర్పాటుకు ముందు మండలంలో మట్టి, కంకర తేలిన రోడ్లు ఉండేవి. వేములవాడ నంది కమాన్‌ నుంచి కోనరావుపేట మండలానికి వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉండేది. నాగారం మీదుగా మర్తనపేట వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. మట్టి రోడ్డుతో పాటు దుబ్బలో గుంతలతో కూడిన రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా నిత్యావసర సరుకులు, ఎరువులు బస్తాల కోసం వేములవాడకు వెళ్లే వారికి ప్రజలు, రైతులకు అపసోపాలు తప్పకపోయేవి. దీంతో ఆయా గ్రామాల్లో ధర్నాలు, రాస్తారోకోలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవతో రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా పనులు చకచకా సాగుతున్నాయి.

చురుగ్గా సాగుతున్న పనులు..

ఎమ్మెల్యే రమేశ్‌బాబు వేములవాడ నంది కమాన్‌ నుంచి మర్తనపేట వరకు రెండు వరుసల రహదారి నిర్మాణ పనులకు కావాల్సిన నిధులు మంజూరు చేయించారు. నంది కమాన్‌ నుంచి పల్లిమక్త వరకు రూ.8 కోట్లు, పల్లిమక్త నుంచి నాగారం వరకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.89లక్షలు మంజూరు కాగా పనులు పూర్తయ్యాయి. అలాగే నాగారం నుంచి మర్తనపేట వరకు మరో రూ.4.3 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపగా ఇటీవల మంజూరయ్యాయి. దీంతో తారురోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

నిత్యం పనుల పర్యవేక్షణ..

రెండు వరుసల రహదారి నిర్మాణ పనులను జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడంతో నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. గుత్తేదారుల జాప్యం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషి చేస్తున్నారు.

ప్రయాణికులకు మార్గం సుగమం..

ఏండ్ల నుంచి రోడ్డు సమస్యతో సతమతమవుతున్న ప్రయాణికులు, ప్రజలకు మార్గం సుగమం కానున్నది.  తారురోడ్డు రెండు వరుసలతో పాటు కల్వర్టులు, ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా వేయడంతో రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇబ్బందులు తప్పాయి..

గతంలో వేములవాడకు అరిగోస పడుకుంటా వెళ్లేటోళ్లం. బండి మీద వెళ్తే ముందున్న వాహనాలతో లేచే దుమ్ముకు ఏమీకనబడక పోయేది. రోడ్డంతా గుంతలతో ఉండేది. గిప్పుడు మాకు డాంబర్‌ రోడ్డు వేయడంతో ఇబ్బంది లేకుండా పోయింది. రోడ్డు వేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే సారుకు ధన్యవాదాలు.

         -నందగిరి తిరుపతిగౌడ్‌, గ్రామస్తుడు, పల్లిమక్త 

రవాణాకు ఇబ్బంది ఉండేది..

మా గ్రామానికి రాకపోకలతో చాలా ఇబ్బందిగా ఉండేది. కంకరతో కూడిన మట్టి రోడ్డు ఉండేసరికి ఎటుపోవాలన్న ప్రజలు అవస్థలు పడేవారు. కానీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు చొరవతో రెండు వరుసల రహదారి నిర్మించారు. మా గ్రామం వరకు ఇప్పటికే పూర్తయింది. ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.

-జిన్న అనిల్‌, సర్పంచ్‌, పల్లిమక్త

పూర్తిస్థాయిలో రోడ్లు..

ప్రభుత్వం గ్రామాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించింది. దీంతో మండలంలో ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నది. ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక నిధులను వెచ్చిస్తూ ప్రతి గడపకూ సీసీ రోడ్లను వేయిస్తున్నారు. 

- ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, ఎంపీపీ, కోనరావుపేట

ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషితోనే..

మండల అభివృద్ధికి ఎమ్మెల్యే రమేశ్‌ బాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా వేములవాడ నంది కమాన్‌ నుంచి మర్తనపేట వరకు రూ.13కోట్లకు పైగా నిధులను మంజూరు చేయించారు. రెండు వరుసల రోడ్డు నిర్మిస్తూ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.

-న్యాలకొండ అరుణ, జడ్పీ చైర్‌పర్సన్‌, రాజన్నసిరిసిల్ల