ఆదివారం 17 జనవరి 2021
Rajanna-siricilla - Nov 28, 2020 , 01:32:34

చెత్తతొ కాసుల వర్షం

చెత్తతొ కాసుల వర్షం

రెండున్నరేళ్ల క్రితమే ఫీకెల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు 

సేంద్రియ ఎరువుల తయారీ

రైతులు, పట్టణవాసులకు విక్రయం

పరిశ్రమలకు పొడిచెత్త అమ్మకం

ఏటా 70 లక్షలకుపైగా ఆదాయంv  రోజుకు 46 టన్నుల చెత్త సేకరణ..

సిరిసిల్ల పట్టణ జనాభా (విలీన గ్రామాలు కలుపుకుని) లక్షా 10 వేలు ఉన్నది. మొత్తం 39 వార్డులు, 18,500 గృహాలు ఉన్నాయి. ఆయా ఇండ్ల నుంచి రోజుకు 46 టన్నుల చెత్త సేకరణ జరుగుతున్నది. అందులో తడిచెత్త 18 టన్నులు, పొడిచెత్త 6 టన్నులు, గృహ నిర్మాణాలకు సంబంధించి 17 టన్నులు, మురుగు కాలువల్లో నుంచి 3 టన్నులు, రహదారుల పక్కన 2 టన్నుల చెత్త సేకరణ జరుగుతున్నది. తడి, పొడి చెత్తను రోజూ ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నారు. ఈ చెత్తను గతంలో ప్రధాన రహదారుల పక్కన పోసే వాళ్లు. డంప్‌ యార్డులు లేక ఎక్కువ శాతం కాలబెట్టేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తతో లాభాలు ఆర్జించే విధంగా కార్యాచరణ చేపట్టింది.ఆదాయంపై సిరిసిల్ల బల్దియా నజర్‌రాజన్న

సిరిసిల్ల, నమస్తేతెలంగాణ : గతంలో పట్టణాల్లో ఇండ్ల నుంచి సేకరించిన చెత్త, మానవ వ్యర్థాలను రహదారుల వెంట సిబ్బంది కుమ్మరించే పరిస్థితి ఉండేది. అందులో నుంచి వెలువడే దుర్గంధం, కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీలలో డంప్‌ యార్డులను ఏర్పాటు చేసింది. చెత్తసేకరణకు ప్రత్యేక సిబ్బంది, వాహనాలను సమకూర్చింది. ఉదయం ఇంటి ముందుకు ట్రాక్టర్‌తో వచ్చిన సిబ్బందికి చెత్తను అందించే అలవాటు చేసింది. సేకరించిన చెత్తను కాలబెట్టకుండా ఎరువుల తయారీకి వినియోగిస్తున్నది. పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమలకు విక్రయిస్తూ ఆదాయం సమకూర్చుకునేలా ప్రోత్సహించింది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో పలువురికి ఉపాధి లభించడంతోపాటు నాణ్యమైన అహార పదార్థాల ఉత్పత్తులకు దోహదపడుతున్నది. మున్సిపాలిటీలు ఉత్పిత్తి చేసిన సేంద్రియ ఎరువుల వాడకంతో పంటల దిగుబడి పెరుగుతున్నది.  

బహుళ ప్రయోజనం..

ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్‌ పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. శుద్ధి ప్రక్రియలో ఎలాంటి దుర్గంధం వెలు వడదు. ఇందులోని కెల్విన్‌ పరికరం ద్వారా ఎక్కడి నుంచయినా ప్లాంట్‌ను నిర్వహించవచ్చు. ఈ ప్లాంట్‌ ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇండ్లలోని సెప్టిక్‌ ట్యాంకులో నిండిన మానవ వ్యర్థం మూడేండ్ల తర్వాత నల్లటి ద్రవంగా మారనుండగా, దానిని ట్యాంకర్లలో నింపి ఎఫ్‌ఎస్‌టీపీకి తరలించి, 24 బెడ్లలో వదులుతారు. మానవవ్యర్థాలను బయోమెథనైజేషన్‌ పద్ధతిలో శుద్ధి చేసి, ఎరువును తయారు చేయనున్నారు. ఈ ప్రక్రియలో వెలువడే నీటిని చెట్లకు వినియోగిస్తున్నారు. మిగిలిన వ్యర్థం 10 రోజులకు ఎండి మట్టి ముద్దలై ఎరువుగా మారుతుంది. నెలకు లక్షా 80 వేల లీటర్ల మానవ వ్యర్థాన్ని సేకరిస్తుండగా, అందులో 75 శాతం నీరు వెలువడుతుండగా,5 టన్నుల ఎరువు ఉత్పత్తి అవుతున్నది. ఏడాదికి 60 టన్నులు వస్తున్నది. ఇండ్ల నుంచి సేకరించిన 18 టన్నుల తడిచెత్తతో రోజుకు 3.6 టన్నుల ఎరువు ఉత్పత్తి అవుతున్నది. ఈ ఎరువులో నెలకు 20 టన్నుల ఎరువును రైతులకు, మరో 15 టన్నుల వరకు పట్టణంలో అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. దీనికి టన్నుకు 10 వేల చొప్పున 3.50 లక్షల వరకు, ఏడాదికి 42లక్షల ఆదాయం సమకూరుతున్నది. 

పరిశ్రమలకు పొడిచెత్త..

తడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారవుతుండగా, పొడిచెత్తను వివిధ పరిశ్రమలు విక్రయిస్తున్నాయి. పొడిచెత్త వ్యర్థాలైన వాడిన టూత్‌పేస్టులు, బ్రష్‌లు, ప్లాస్టిక్‌ సీసాలు, చెప్పులు, పెన్నులు, డబ్బాలు, అట్టపెట్టెలు, కాగితాలు, బ్యాట్లు, ఇతర సామగ్రి పొడిచెత్త కిందకు వస్తాయి. తడి, పొడి చెత్తనువేర్వేరుగా సేకరించేందుకు మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే ఇంటింటికీ రెండు చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. సేకరించిన వ్యర్థాలను డంప్‌ యార్డుకు తరలించి వాటిని వేరువేరు కుప్పలు పోస్తారు. పొడి చెత్తను హైదరాబాద్‌లో రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమలకు విక్రయిస్తారు. బీడీ పరిశ్రమ అధికంగా ఉన్నందున పొడి చెత్తలో సేకరించిన బీడీ ఆకును విద్యుత్‌ తయారీ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. దీనికి నెలకు 2 లక్షల నుంచి 2.50 లక్షల వరకు, ఏడాదికి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది. ఈ లెక్కన చెత్త, మానవ వ్యర్థాలతో అన్ని ఖర్చులూ పోను 70 లక్షలకుపైగా ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జాతీయ అవార్డులు.. 

చెత్తను సేకరించి ఎరువుగా మార్చి ఆదాయం పెంపొందించుకుంటూనే ఉపాధి మార్గాలు చూపిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో మూడుసార్లు అవార్డులు అందుకున్నది. స్వచ్ఛతలో సిరిసిల్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపుతూ 2020-21 సంవత్సరంలో మరోసారి అవార్డును దక్కించుకునేం దుకు కేటీఆర్‌ సూచనలతో అధికార యంత్రాగం తీవ్రంగా కృషి చేస్తున్నది. v  రెండున్నరేళ్ల క్రితమే మానవ వ్యర్థాల యూనిట్‌.. 

ప్రజారోగ్యం బాగుండాలంటే నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించారు. ఈ మేరకు తయారీ బాధ్యతలను పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. అందుకు ప్రత్యేక నిధులు కేటాయించి డంప్‌ యార్డులను ఏర్పాటు చేశారు. సేకరించిన చెత్తతో పాటు సెప్టిక్‌ ట్యాంకులో వదిలే మానవ వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేస్తున్న కర్నాటకలోని దేవనహళ్లిని ఆదర్శంగా తీసుకున్నది. మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో నేషనల్‌ అర్బన్‌ శానిటేషన్‌ పాలసీ పథకం కింద రాష్ట్రంలో తొలిసారిగా సిరిసిల్ల మున్సిపల్‌ను ఎంపిక చేసింది. రెండున్నరేళ్ల క్రితం 65 లక్షలతో రగుడు శివారులోని 15 ఎకరాల డంప్‌ యార్డులో ఎకరం స్థలంలో మానవ వ్యర్థాల యూనిట్‌ (ఫీకెల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ -ఎఫ్‌ఎస్‌టీపీ)ని నెలకొల్పింది. ప్రస్తుతం వరంగల్‌, సిరిసిల్లలో మాత్రమే ఈ యూనిట్లు పనిచేస్తున్నాయి. 

స్వయం ఉపాధి..

చెత్తను సేకరించే బాధ్యతను స్వయం సహాయక బృందాల మహిళలకు అప్పగించారు. 20 మంది మహిళలు, 125 మంది అవుట్‌ సోర్సింగ్‌, 42 మంది రెగ్యులర్‌ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇంటింటికీ ట్రాక్టర్లు తీసుకెళ్లి సిబ్బంది నేరుగా సేకరించిన తడి, పొడిచెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ మహిళలు తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తడిచెత్తను అక్కడే ఎరువు కోసం వినియోగిస్తుండగా, పొడిచెత్తను వివిధ వాహనాల్లో హైదరాబాద్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు. స్వయం సహయక మహిళలు వ్యర్థాల సేకరణపై నెలకు ఒక్కొక్కరు 15 వేల నుంచి 20 వేల వరకు సంపాదిస్తున్నారు. 

 ఎరువు బాగా పనిచేస్తున్నది..

మున్సిపాలిటీలో తయారైన సేంద్రియ ఎరువు చాలా బాగా పనిచేస్తుంది. నాకున్న రెండెకరాల్లో 200 మామిడి చెట్లకు ఎరువు వేసిన. రసాయనిక ఎరువులు, మందుల కన్నా సేంద్రియ ఎరువుతో పంట దిగుబడి బాగా వస్తున్నది. చెట్లు బాగా ఇగురు పెట్టినయి.

- అహ్మద్‌ సయాద్‌ఖాన్‌, రైతు (సిరిసిల్ల)

ప్రజల సహకారంతోనే అవార్డులు 

స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తూ జాతీయ స్థాయిలో ఇప్పటికే మూడు సార్లు అవార్డులు అందుకున్నాం. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రజలు, పాలకవర్గం సహకారం వల్లనే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మానవ వ్యర్థాల యూనిట్‌ను ప్రభుత్వం ఇక్కడ నెలకొల్పింది. తడి చెత్త, మానవ వ్యర్థాలతో ఎరువులు ఉత్పత్తి చేస్తూ, పొడిచెత్తను విక్రయిస్తున్నాం. దీని ద్వారా ఏటా 75 లక్షల వరకు ఆదాయం మున్సిపల్‌కు వస్తున్నది. డిమాండ్‌ పెరుగుతున్నందున మరింత ఉత్పిత్తి పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. 18 లక్షలతో ఇన్సినారేటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.

- సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ (సిరిసిల్ల)

చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు

చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రజలు ఇండ్లలోని తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంచి మార్పు వచ్చింది. సేకరించిన చెత్త వృథా కాకుండా తడిచెత్త మానవ వ్యర్థాన్ని ఎరువుగా మారుస్తున్నాం. పొడిచెత్తను రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమలకు విక్రయిస్తున్నాం. సేంద్రియ ఎరువులను హరితహారంలో నాటిన మొక్కలకు వేస్తున్నాం. కిలో 10ల చొప్పున 20 టన్నుల వరకు రైతులకు విక్రయిస్తున్నాం. రైతుల నుంచి డిమాండ్‌ వస్తున్నందున ఉత్పిత్తి పెంచేందుకు కృషి చేస్తున్నాం.

- ఎస్‌ రఘు, పర్యావరణ ఇంజినీర్‌ (సిరిసిల్ల మున్సిపాలిటీ)