మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 18, 2020 , 02:31:01

నిర్వాసితులను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్సే

నిర్వాసితులను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్సే

  •  పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు 
  •  పరిహారం చెల్లించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన విషయం గుర్తు లేదా ?
  •  విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి 
  •   రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: మధ్యమానేరు ముంపు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ఆ పార్టీ చేసిన తప్పిదమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, విమర్శలు చేసే ముందు ఆలోచించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై, పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించిందని, తర్వాత 2013లో ఇవ్వబోమని మాట మార్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2008లో మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం 1984 చట్టం ప్రకారం భూసేకరణ ప్రారంభించిందని తెలిపారు. భూసేకరణలో జరిగిన జాప్యం, నిర్వాసితులకు పరిహారం అందించకపోవడం అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు గల్లంతయ్యాయని, ఎవరికి పరిహారం ఎంత ఇవ్వాలో కూడా ఆ ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. చింతలఠాణా, చీర్లవంచ గ్రామాల్లో ఇండ్లు ఎన్ని ముంపునకు గురయ్యాయన్నది స్పష్టత లేదన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా కృషి చేస్తున్నదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కమిటీలు వేసిందన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుపురంలో 725 మంది నిర్వాసితులను గుర్తించిందని, వారిలో 14 మందికి పరిహారం అందలేదని బాధితులు పేర్కొంటున్నారని తెలిపారు. వీరికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిహారం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. పరిహారం విషయంలో తలెత్తిన సమస్యలన్నీ 2008 నుంచి 2013వరకు రాష్ట్రం ఏర్పాటు కాకముందు తలెత్తినవేనని స్పష్టంచేశారు. నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌ సమక్షంలో గ్రామ పెద్దలు, సర్పంచ్‌, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఒక్కొక్క గ్రామంపై సమీక్షించి పరిష్కారానికి అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. రిక్విజియేషన్‌ డిపార్ట్‌మెంటు ఈఎన్సీ అనిల్‌కుమార్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో 18 ఏండ్లు నిండిన యువతీయువకులకు రెండు వేల మందికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో వెయ్యి మందికి రూ. 2 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. మరో వెయ్యి మందికి త్వరలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్‌, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి కృషి చేస్తున్నారన్నారు. బఫర్‌జోన్‌కు బయట ఉన్న గ్రామాలను రీనోటిఫై చేసి గుర్తించారని తెలిపారు. అనుపురం, కొడుముంజ, చీర్లవంచ, చింతలఠాణా ఇలా అన్ని గ్రామాల సమస్యలపై అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్‌ అయిన వాటిని పరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఐఏవై ఇండ్లతో పాటు ఇంకా ఏమైనా ఇవ్వవచ్చా అన్నది చట్టపరంగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. నిర్వాసితుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. 

మిషన్‌ కాకతీయతో అద్భుత ఫలితాలు 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుత ఫలితాలు ఇస్తున్నదని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన వెంటనే మిషన్‌ కాకతీయ పథకం కింద 44వేల చెరువులను మరమ్మత్తు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల కురిసిన కనీ, వినీ ఎరగని భారీ వర్షాలకు చెరువులు నిండినా, ఎక్కడైనా కట్ట, కుంట తెగిందా? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. పదేండ్ల కింద వర్షాలు పడితే తెల్లారే చెరువుల కట్టలు తెగి నీరంతా వృథాగా పోయిన ఘటనలు గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువులు నిండి తెలంగాణలో భూమిలో ఇంకిన నీరు 600 టీఎంసీలు ఉంటుందని తెలిపారు. మరో మూడేండ్ల వరకు కరువు ఉండదన్నారు. గతంలో కరువుతో అల్లాడిన సిరిసిల్ల ప్రాంతం మిషన్‌ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు పెరిగి సస్యశ్యామలమైందని తెలిపారు. సమావేశంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.