మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 16, 2020 , 01:30:43

కార్తీకం.. పరమ పవిత్రం..

కార్తీకం.. పరమ పవిత్రం..

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం

ఆహార నియమాలతో ఆరోగ్యానికి మేలు

ఉపవాసాలకు సిద్ధమవుతున్న మహిళలు

నేటి నుంచి కార్తీక మాసం ఆరంభం

ఈ ఏడాది సోమవారం రావడం మరింత విశిష్టం

కోల్‌సిటీ/ వేములవాడ కల్చరల్‌: కార్తీకం హిందువులకు పరమ పవిత్రమైన మాసం. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి దేదీప్యమైన కాలం..భక్తకోటిని శివ నామస్మరణతో పులకరింపచేసి శాస్త్రీయమైన జీవన విధానాన్ని అలవరుచుకునేలా చూసే సమయం.. ఈ నెల రోజుల పాటు అన్ని వర్గాల వారు భక్తిపారవశ్యంలో మునిగితేలే మాసం.. మహిళలు ఇంటిల్లిపాది క్షేమంగా ఉండాలంటూ ఆ శివుడిని ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలు చేస్తుంటారు. వేకువజామునే లేచి చన్నీటి స్నానం ఆచరించడం.. దీపారాధన, శివ పార్వతులకు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఆ శివ పార్వతులకు సైతం ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. కానీ, ఈ సంవత్సరం కరోనా కారణంగా భక్తులు ఆలయాలను సందర్శించుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకున్నది. ఇదిలా ఉండగా ఈఏడాది సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడం అత్యంత విశిష్టతను సంతరించుకుంటున్నదని వేద పండితులు చెబుతున్నారు. 

ఈ మాసం ప్రత్యేకతలు..

ఈ మాసంలో సోమవారాల్లో స్నానదాన జపముల్లో ఏ ఒక్కటి ఆచరించినా వెయ్యి అశ్వమేథ యాగాలతో సమానమని స్కంధ పురాణం చెబుతున్నది. దీపారాధన, తులసి మొక్కను ఆరాధించడమూ పవిత్రమే. ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు ఈ నెలలో వ్రతాలు, రాత్రి సమయాల్లో దేవాలయాల వద్ద తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. శివాభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవడం, మోక్షమార్గం వైపు పయ నించడానికి ఇది అనువైన కాలం. ఈ నెలలో నియమ, నిష్ఠలతో చేపట్టే పూజాదికాలు, దీపారాధనలు ఆత్మ ప్రకాశానికి దోహద పడుతాయి. నదీ స్నానం, ఆలయ దర్శనం, మితాహారం, దీపారాధన, వ్రతాలు, నోములు పాటించడంతోనే ఈ నెలను అత్యంత పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ఈ యేడాది కార్తీక మాసంలో 5 సోమవారాలు వచ్చాయి. నవంబర్‌ 16వ తేదీ నుంచి డిసెంబర్‌ 14వ తేదీ వరకు కార్తీక మాసాన్ని  పాటిస్తారు. ఈ నెలలో అయ్యప్ప దీక్ష మాలధారణ కూడా రావడం విశేషం.

భక్తి శ్రద్ధలతో దీపారాధన...

ఈ మాసంలో శివాలయాలు మార్మోగనున్నాయి. సామూహిక దీపారాధన, పూజలతో ఆలయాలు కళకళలాడనున్నాయి. నెల రోజులు పాటించే ఆహార నియమాలు దేహంలోని అనేక రుగ్మతలను దూరం చేస్తాయి. దేహంలో పేరుకుపోయిన చెడు కొవ్వు, ఇతర మలినాలు తొలగిపోతాయి. మాంసాహారం, ఇతర మసాల పదార్థాలు ఆరగించకపోవడంతో ఆహార క్రమశిక్షణ అలవడుతుంది.