ఆదివారం 06 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 11, 2020 , 01:14:43

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

పోక్సో చట్టంలోని నూతన నిబంధనలపై అవగాహన 

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: చట్టాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. మంగళవారం స్థానిక పొదుపు సంఘం భవనంలో పోక్సో చట్టం నూతన నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం బాధిత కుటుంబాలకు అందేలా చూడాలని పేర్కొన్నారు. పోక్సో చట్టం అమలుకు ఐసీడీఎస్‌ సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, పోలీస్‌ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ అంజయ్య మాట్లాడుతూ, పోక్సో చట్టంలో 46 సెక్షన్లు ఉన్నాయన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు పోలీస్‌ శాఖ కేసు నమోదు చేయగానే ఎఫ్‌ఐఆర్‌ కాపీని జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి పంపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీరాం, సిరిసిల్ల, వేములవాడ సీడీపీవోలు అలేఖ్య, ఎల్లయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వర్ణలత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

క్యాంపు కార్యాలయ పనులు పూర్తిచేయాలి

సిరిసిల్ల టౌన్‌: నూతన కలెక్టరేట్‌ సముదాయంలోని క్యాంపు కార్యాలయ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ వద్ద నిర్మిస్తున్న నివాస గృహాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అలాగే అప్రోచ్‌ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. నిర్మాణ పనుల్లో సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు ఉన్నారు.