శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 09, 2020 , 01:59:11

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

సన్నరకం వరి ధాన్యం ధర పెంపునకు ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఇల్లంతకుంట : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. ఆదివారం మండలంలోని వంతడుపుల, నారెడ్డిపల్లి, పత్తికుంట పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనతో రైతులు సన్నరకం వరి ధాన్యం పండించారని, వాటి ధర పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులు అధైర్య పడొద్దని, కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. ఆరుగాలం శ్రమించి ధాన్యం పండించిన రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

రోడ్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతు, కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు అందించిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలోని పంచాయతీ రాజ్‌ శాఖ రోడ్లకు సైతం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. మండలంలోని నర్సక్కపేట-జవారుపేట గ్రామాల మధ్య బిక్క వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 లక్షలు, గాలిపెల్లి - జవారుపేట గ్రామాల మధ్య కల్వర్టు నిర్మాణానికి రూ.29 లక్షలు, పొత్తూరు నుంచి ముస్కానిపేట గ్రామం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణకు రూ. కోటి, పొత్తూరు-కందికట్కూర్‌ గ్రామాల మధ్య సుద్దొర్రెపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి, కందికట్కూర్‌ బస్టాండ్‌ దగ్గరలోని చర్చి వద్ద ఒర్రెపై నూతనంగా బ్రిడ్జి కోసం రూ.కోటి, పెద్దలింగాపూర్‌ - అనంతారం గ్రామాల మధ్య తాత్కాలికంగా కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేశారని వివరించారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐలయ్య, వైస్‌ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అన్నాడి అనంతరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, సర్పంచులు కట్ట వెంకట్‌ రెడ్డి, చింతలపెల్లి శ్రీలతతోపాటు ఏఎంసీ, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.