శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 08, 2020 , 01:38:17

‘తామర నార’తో చీర

‘తామర నార’తో చీర

నైపుణ్యం చాటిన నేత కార్మికుడు విజయ్‌

సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా వినూత్న ఆవిష్కరణలు

నాడు తండ్రి అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ 

నేడు అదే బాటలో తనయుడు 

సిరిసిల్ల నేతన్నలు తమ ప్రతిభతో విభిన్న ఆవిష్కరణలు చేస్తున్నారు. నాడు నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి ప్రపంచం అబ్బుర పరిచేలా చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు నల్ల విజయ్‌ తండ్రి బాటలో వినూత్న ఆవిష్కరణలు చేస్త్తూ సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచాడు. కంచిలో వెండి కొంగుతో తయారయ్యే చీరను విజయ్‌ ఈ ఏడాది మే నెలలో ఇక్కడ తయారు చేసి మంత్రి కేటీఆర్‌కు అందివ్వగా, తాజాగా తామర నారతో చీరను తయారు చేసి శనివారం ప్రదర్శించాడు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ ఇస్తున్న ప్రోత్సాహంతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నాడు. 

-సిరిసిల్ల రూరల్‌


సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన దివంగత నేత కార్మికుడు నల్ల పరంధాములు బాటలోనే తనయుడు విజయ్‌ నడుస్తున్నాడు. తండ్రి పరంధాములు 1987లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ఇప్పుడు ఆయన బాటలోనే అతని కొడుకు విజయ్‌ నడుస్తున్నాడు. విభిన్న, వినూత్న ఆవిష్కరణలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని మరింత వ్యాప్తి చేస్తున్నాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువాలను తయారు చేశాడు. దబ్బడం, ఉంగరంలో దూరే చీరను సైతం తయారు చేసి ఔరా అనిపించాడు. వీటితోపాటు కుట్టు లేకుండా లాల్చీ పైజామా డ్రెస్‌, జాతీయ జెండా తయారు చేశాడు. మూడు కొంగులతో చీరను సైతం తయారు చేసి అబ్బురపరచాడు. 220 రంగుల్లో చీరను రూపొందించాడు. దబ్బడంలో దూరే చీరతోపాటు 220 రంగుల్లో చీరకు 2018, 2019లో తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో రెండుసార్లు పేరు నమోదైంది. 2015లో చేనేత కళారత్న అవార్డును సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా విజయ్‌ అందుకున్నాడు.

మూడు రోజులు శ్రమించి..

నేత కార్మికుడు విజయ్‌ తాజాగా, తామర నారతో పట్టు చీరను తయారు చేశాడు. దీనికోసం మూడు రోజుల పాటు శ్రమించాడు. ఈ చీర 5 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవు ఉండగా, కొంగు 90 సెం.మీ. పొడవు ఉంది. ఈ కొంగును 50 శాతం తామర నార, 50 శాతం పట్టుతో తయారు చేశాడు. చీర తయారీకి రూ.12వేల వరకు వెచ్చించాడు. మా న్యువల్‌ జకార్డ్‌ యంత్రంతో మరమగ్గంపై తామర నారతో ఈ చీరను తయారు చేశాడు.

సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే.. 

సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నా. నాన్న పరంధాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నా. గతంలో అరటి నారతో చేసిన శాలువాను సీఎం కేసీఆర్‌కు అందించా. సిరిసిల్ల ఖ్యాతి, బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నా. ఈ ఏడాది మే నెలలో వెండి కొంగుతో పట్టుచీరను తయారుచేశా. త్వరలోనే పూర్తి వెండితో చీరను తయారు చేస్తా. అభిరుచితోనే తామర నారతో పట్టు చీరను తయారు చేశా. సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తా. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రోత్సాహం మరువలేనిది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

- నల్ల విజయ్‌, నేత కార్మికుడు, సిరిసిల్ల