శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 05, 2020 , 02:24:00

ఓటీపీతో రేషన్‌

ఓటీపీతో రేషన్‌

అందుబాటులోకి సేవలు 

కరోనా నేపథ్యంలో నిర్ణయం 

ఆధార్‌తో లింకయిన ఫోన్‌ నంబర్లకు అవకాశం

రాజన్న సిరిసిల్ల నమస్తే తెలంగాణ/సిరిసిల్ల: ఇప్పటికే ఈ పాస్‌, పింగర్‌ఫ్రింట్‌, ఐరిస్‌ విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చి రేషన్‌ సరుకుల పంపిణీ సరళీకరించిన ప్రభుత్వం తాజాగా ఓటపీ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఈ ఆధునాతన పద్ధతికి శ్రీకారం చుట్టనున్నది. ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన ఫోన్‌ నంబర్లు గల వినియోగదారులకు ఈ సేవలు అందే అవకాశం ఉన్నది.  

సులభంగా..పారదర్శకంగా..

తెలంగాణ సర్కారు రేషన్‌ సరుకుల పంపిణీని సరళీకరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నది. ఇప్పటికే డీలర్లందరికీ ఈ పాస్‌ మిషన్లను అందజేయడంతో పాటు ఫింగర్‌ ఫ్రింట్‌ విధానా న్ని అమల్లోకి తెచ్చింది. అలాగే రేషన్‌ దుకాణాలకు చేర్చే వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానించింది. అయితే  వేలిముద్రలు పడని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి వీఆర్వో, వీఆర్‌ఏలు అథేంటికేషన్‌ ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ రద్దుతో  థర్డ్‌ పార్టీ అథేంటికేషన్‌ లేకుండా సరుకులను పంపిణీ చేసేలా మూడు రకాలుగా అవకాశాలు కల్పించింది. రేషన్‌కార్డు వినియోగదారుడి వేలి ముద్రలు పడని చోట ఐరిస్‌, ఇది రానిచోట ‘ఓటీపీ’ ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలో 344 రేషన్‌దుకాణాలు

జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో ఆహార భద్రత పథకం ద్వారా 1,72,891 కుటుంబాల్లో 5,03,287 మంది లబ్ధి పొందుతున్నారు. ఆహార భద్రత కార్డులు 1,59,0 47, అంత్యోదయ కార్డులు 13,613, అన్నపూర్ణ కార్డులు 231 ఉన్నాయి. ఆహార భద్రత కార్డు ద్వారా ఒక్కో కుటుంబ సభ్యుడికి 10 కిలోల బియ్యం, అం త్యోదయకార్డు ద్వారా ఒక్కో కుటుంబానికి 35, అన్నపూర్ణ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు.

నూతన విధానం ఇలా..

కరోనా కట్టడే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.  రేషన్‌ దుకాణాల పరిధిలో ఉన్న తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులు తమ ఫోన్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకోవాలి. సరుకుల కోసం వెళ్లినప్పుడు ఈ-పాస్‌ యంత్రంలో కార్డు నంబర్‌ నమోదు చేయడంతో సంబంధిత లబ్ధిదారుడి ఫోన్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ను ఈ-పాస్‌ యంత్రంలో నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఎలక్ట్రానిక్‌ కాంటాలో బియ్యం తూకం వేసిన వెంటనే సక్సెస్‌ అని ఈ-పాస్‌ తెరపై చూపిస్తుంది. 

ఓటీపీ విధానం బాగుంది.

వేలిముద్రలతో కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రభుత్వం ఓటీపీ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో లబ్ధిదారుడికి సమాచారం లేకుండా మరొకరు బియ్యం తీసుకునే అవకాశం గానీ, అక్రమాలకు పాల్పడే వీలు లేదు. ఈ విధానం బాగుంది.

- పొన్నం శ్రీనివాస్‌, జిల్లా రేషన్‌ దుకాణాల సంఘం సంయుక్త కార్యదర్శి