శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 03, 2020 , 01:43:10

నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌

తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ సేవలు ప్రారంభం

విజయవంతంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

సంబురపడుతున్న రైతాంగం

ఏండ్ల తరబడి రైతులు పడుతున్న భూ సమస్యలకు ధరణి పోర్టల్‌ ద్వారా నిమిషాల్లో పరిష్కారం లభిస్తున్నది. సోమవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతమైంది. పైరవీలకు తావులేకుండా ఆన్‌లైన్‌లో ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

తహసీల్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రా రంభించడం బంగారు తెలంగాణకు నిదర్శనమని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం వారు తహసీల్దార్లతో కలిసి ధరణి పోర్టల్‌ సేవలను ప్రారంభించారు. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి పాస్‌బుక్‌ ఇవ్వడంతో రైతులు సంతోషపడుతున్నారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని వారు పేర్కొంటున్నారు.

కోనరావుపేట: తహసీల్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ ప్రారంభించారు. ఎంపీపీ తనకున్న నాలుగెకరాల భూమిని గిఫ్ట్‌ డీడీ ద్వారా అతడి భార్యకు తొలి రిజిస్ట్రేషన్‌ చేయించారు. మండలంలో ఒక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కాగా, మరో నలుగురు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని తహసీల్దార్‌ నరేందర్‌ తెలిపారు. ఇందులో ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్‌ మల్యా ల దేవయ్య, ఎంపీటీసీ నరసింహచారి, ఆర్‌ఐ రాంచంద్రం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి ఉన్నారు.

బోయినపల్లి: తహసీల్దార్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ ప్రారంభించారు. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ధరణి పోర్టల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఏడుగురు రైతులు భూముల క్రయవిక్రయాలు జరుపగా, ఆరు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఉద యం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు చేస్తామని ఇన్‌చార్జి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నవీన్‌ తెలిపారు. ఇందులో ఆర్‌ఐ విజయేందర్‌రెడ్డి, భూపేశ్‌రెడ్డి, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ గుంటి లతశ్రీ, నాయకులు కత్తెరపాక కొండయ్య, గుంటి శంకర్‌ ఉన్నారు.

వేములవాడ రూరల్‌: వేములవాడ అర్బన్‌ మండలంలో ఒకటి గిఫ్ట్‌, రెండు సేల్‌ డీడీ కాగా వేములవాడ రూరల్‌లో రెండు గిఫ్ట్‌ డీడీ, ఒకటి సేల్‌ డీడీ రిజిస్ట్రేషన్లు చేశారు. తహసీల్దార్లు మునీందర్‌, శ్రీనివాస్‌ మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తెలిపారు. మొదటి రోజు కొంత ఆలస్యమైనా రిజిస్ట్రేషన్‌ ప్రకియను పూర్తి చేశామన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో ఆర్‌ఐలు లక్ష్మణ్‌, కుమార్‌, సతీశ్‌ ఉన్నారు.

గంభీరావుపేట: తహసీల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీనివాస్‌తో కలిసి  ధరణి పోర్టల్‌ సేవలను ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ ప్రారంభించా రు. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావడం సం తోషకరమన్నారు. ఇందులో సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, వైస్‌ ఎంపీపీ దోసల లత, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ రాజేందర్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్‌, ఉప సర్పంచ్‌ సింగారపు నాగరాజుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, బాలవ్వ, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, దోసల రాజు, నాగారపు దేవేందర్‌, గంద్యాడపు రాజు ఉన్నారు. 

ఇల్లంతకుంట: తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ సేవలు విజయవంతంగా ప్రారంభమైనట్లు తహసీల్దార్‌ రాజిరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈ విధానం ఎంతో సులభంగా ఉందన్నారు. మొదటి రోజు ఐదు రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తహసీల్దార్‌ చెప్పారు.

చందుర్తి: మండల కేంద్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా భూ ముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తహసీల్దార్‌ నరేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటి రోజు 2 సేల్‌ డీడీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు. ఎన్గల్‌కు చెందిన ఏనుగుల రేణు క, గడ్డం పరుశరాములు భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. 

20 నిమిషాల లోపే పూర్తి

ధరణి ద్వారా రైతుల భూమి క్రయావిక్రయాలు నిర్ధిష్ట సయంలోపే పూర్తి అవుతున్నది. ప్రభుత్వం సూచనల మేరకే ఈ రోజు ఆరుగురు రైతులు మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకొని నిర్ణీత సమయంలో వచ్చి పట్టా మార్పిడి చేయించుకున్నరు. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాక్షుల సమక్షంలో నిర్ధారాణ చేసి మార్పిడి చేసినం. కొనుగోలుదారుడికి పట్టా పుస్తకం పాతది ఉంటే దానిలోనే ఫ్రింట్‌ చేసి ఇచ్చినం. పాస్‌బుక్‌ లేని రైతులకు వెంటనే డ్రాప్ట్‌ కాపీలను ఇచ్చి వారిక్‌ పోస్టు ద్వారా పట్టా పాస్‌బుక్‌ పంపిస్తాం. ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు వచ్చినా ట్రెసా ఆధ్వర్యంలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం.   

- జయంత్‌ కుమార్‌, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు (సిరిసిల్ల ఎడ్యుకేషన్‌)


పారదర్శకంగా పట్టా మార్పిడి

ధరణి పోర్టల్‌ విజయవంతంగా ప్రారంభించినం. ఆరుగురు రైతులకు పట్టా మర్పిడి చేసినం. ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు లేకుండా అధికారులు సహకరించిన్రు. ఐదుగురు రైతులకు పట్టా మార్పిడి జరిగిన వెంటనే డ్రాప్ట్‌ కాపీలను అందజేసినం. మరో రైతుకు పాత పాస్‌బుక్‌ ఉండడంతో అందులో ఫ్రింట్‌ తీసి ఇచ్చినం. రైతులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో అమ్మకందారు, కొనుగోలుదారు పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలి. రైతులు స్లాట్‌లో పేర్కొన్న సమయం ప్రకారం ఆఫీస్‌కు వచ్చి అధికారులకు సహకరించాలి.

- శ్రీకాంత్‌, తహసీల్దార్‌, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల ఎడ్యుకేషన్‌)


చాలా సంతోషంగా ఉన్నది

ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. నేను గిఫ్ట్‌ డీడీ ద్వారా తన భర్త మధుకర్‌రెడ్డి నుంచి 17గుంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. ఆదివారం బోయినపల్లి మీ సేవలో దరఖాస్తు చేసుకున్న. సోమవారం భూమి రిజిస్ర్టేషన్‌ అయిపోయింది. ధరణి పోర్టల్‌తో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. అదనపు ఖర్చు కూడా కావడం లేదు. అధికారుల చుట్టు తిరుగాల్సిన అవసరం లేదు.

- ముచ్చ జ్యోతి, మహిళా రైతు, స్తంబంపల్లి (బోయినపల్లి)


మత్తు తిప్పలైతుండె..

నా పేరు మీద ఉన్న భూమిలకెళ్లి పది గుంటలంత అమ్మితే మా పక్క పొంటళ్లు ముగ్గురు కలిసి మనిషికింత తీసుకున్నరు. కేసీఆర్‌ సారు చెప్పినట్టుగానే మీ సేవల స్లాట్‌ బుక్‌ చేసుకున్న. ముగ్గురు సాక్షులు, నా ఇద్దరు కొడుకులతో పాటు నా భార్య కూడా దగ్గరుండె పాటికే ఆఫీస్‌కు అచ్చింది. సూత్తుండగానే పోట్వలు, ఏలిముద్రలు తీసుకున్నరు. నా పేరు మీదున్న భూమి కొన్నొళ్ల పేరు మీదకు ఎక్కిచినం. పనైపోయింది పొమ్మన్నరు సార్లు. మునుపైతే గంటల కొద్ది నిలబడలేక మత్తు తిప్పలైతుండె.

- ఒరగంటి దేవయ్య, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల ఎడ్యుకేషన్‌)


సాక్షులుగా పోతే సగం పానాలు పోయేవి

మునుపైతే రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు పోతే మనతోపాటు సాక్షులుగా అచ్చినోళ్ల పానాలు సగం సచ్చేవి. బ్రోకర్ల తప్పుఅయిన, అక్కడ ఆఫీస్‌లకు మంది ఎక్కువచ్చిన ఇయ్యాలా కాదుపో అంటే మళ్లా అల్లు రమ్మన్న రోజు సాక్షులను బతిమిలాడి తోలుకపోయేది. ఏపని సక్కగా అయ్యేది కాదు. ఎందుకంటే ఎన్నో ఊళ్లకు కల్పి ఒకటే ఆఫీస్‌ ఉంటుండే. అది కూడా పద్ధతిలెక్క జేసేటోళ్లు కాదు. తెలిసినోళ్లు సదువుకున్నాల్లో అత్తేగాని పనయ్యేది కాదు. ఇయ్యాలా తహసీల్‌ ఆఫీస్‌లోనే నేను కొన్న భూమి నా పేరు మీద ఎక్కించుకున్న.

- వడ్నాల రామస్వామి పటేల్‌, ఎల్లారెడ్డిపేట