మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 02, 2020 , 01:13:06

కష్టాల్లో కన్నోళ్లు.. ప్రాణాపాయస్థితిలో పెద్దదిక్కు

కష్టాల్లో కన్నోళ్లు.. ప్రాణాపాయస్థితిలో పెద్దదిక్కు

వృద్ధాప్యంతో నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు

అనుకోని ప్రమాదంతో దవాఖానలో కొడుకు  

చికిత్సకు 6లక్షల నుంచి 7లక్షల ఖర్చు

చిల్లిగవ్వలేక కుటుంబం తండ్లాట

ఆరు నెలల కొడుకుతో తల్లడిల్లుతున్న భార్య 

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ఎల్లారెడ్డిపేట : మండలం కోరుట్లపేటకు చెందిన గర్గుల అంజయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు శేఖర్‌ ఉన్నాడు. ఉన్నంతలో వీరి పెళ్లిళ్లను చేశారు. శేఖర్‌కు ఏడాదిన్నర కిందట బోయినపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన స్వాతితో వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల కుమారుడు మానస్‌ ఉన్నాడు. శేఖర్‌ తల్లి నరాల సంబంధ వ్యాధితో బాధపడుతూ కొన్నేళ్ల కిందట అంధురాలైంది. తండ్రి మేకలను కాస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే ఆరు నెలల కిందట తండ్రి కూడా అనారోగ్యం పాలై నడువలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబ భారాన్ని ఎత్తుకున్న శేఖర్‌, ఫైనాన్స్‌ ద్వారా ఆటో కొనుగోలు చేసి నడుపుకుంటున్నాడు. అయితే కరోనా వైరస్‌ అతడిని కష్టాల్లోకి నెట్టింది. కిస్తీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆటోను ఫైనాన్స్‌ వారు లాక్కెళ్లారు. ఈ పరిస్థితుల్లో కులవృత్తి వైపు మళ్లాడు. కొన్ని నెలలుగా కల్లు గీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. దసరా రోజు శేఖర్‌ తన బైక్‌పై గంభీరావుపేట నుంచి కోరుట్లపేట వైపునకు వస్తుండగా, అదుపుతప్పి ఓ స్తంభానికి ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అయితే శస్త్రచికిత్సకు 6లక్షల నుంచి 7లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శేఖర్‌ దీనస్థితిని తెలుసుకొని మిత్రులు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. తలాకొంత పోగుచేసి 1.19 లక్షలు అందజేశారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు 9533626979నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నారు.