శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 01, 2020 , 01:17:55

సిరిసిల్ల సెస్‌ దేశానికే తలమానికం

సిరిసిల్ల సెస్‌ దేశానికే తలమానికం

ఐదు దశాబ్దాలుగా నిరంతర సేవలు 

నాలుగు నియోజకవర్గాల పరిధిలో కరెంట్‌ కాంతులు  

నేటితో యాభై వసంతాలు పూర్తి

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నది. 1970 నవంబర్‌ 1న ఈ సంస్థను స్థాపించగా నేటి(ఆదివారం)తో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నది. సెస్‌ పరిధిలోని పల్లెలు, పట్టణాల్లో విద్యుత్‌ కాంతులు విరజిమ్ముతూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. 1960లో నాటి భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా అమెరికా ప్రభుత్వ సహకారంతో గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగా 1970 నవంబర్‌ 1న సిరిసిల్లలో సెస్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సెస్‌ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడారు. జిల్లా పరిధిలో గల నాలుగు నియోజకవర్గాల్లోని 255 గ్రామ పంచాయతీల్లో సెస్‌ సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 6,291 ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ కనెక్షన్లు 2,55,803, 11కేవీ లైన్‌ 6147, 6.3, కేవీ లైన్‌ 961.70, ఎల్‌టీ లైన్‌ 8124 కిలోమీటర్లు, సబ్‌స్టేషన్లు 132/33కేవీ 5, 33/11కేవీ 71, 11కేవీ ఫీడర్స్‌ 227, వ్యవసాయానికి సంబంధించిన 11కేవీ ఫీడర్స్‌ 48 సేవలను ప్రస్తుతం వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌ సహకారంతో ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. అప్పటి ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల సెస్‌ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో సేవల విస్తరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సెస్‌ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.