మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 31, 2020 , 01:09:14

రైతువేదికలు రెడీ

రైతువేదికలు రెడీ

దాతల విరాళం, ప్రభుత్వ నిధులతో నిర్మాణం

గంభీరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్ల వారీగా చేపట్టిన రైతువేదికల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తికాగా, మరికొన్ని గ్రామాల్లో వేగంగా సాగుతున్నది. గంభీరావుపేట మండలంలోని ఐదు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మిస్తున్నారు. మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ సొంత ఖర్చుతో చేపట్టిన రైతు వేదిక పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే సముద్రలింగాపూర్‌లో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సొంతంగా నిర్మిస్తున్న రైతు వేదిక పనులు వేగంగా సాగుతున్నాయి. మిగతా మూడు లింగన్నపేట, మల్లారెడ్డిపేట, నర్మాల క్లస్టర్లలో ప్రభుత్వ నిధులతో పనులు జరుగుతున్నాయి. 

ఎల్లారెడ్డిపేట: మండలంలోని  24 గ్రామపంచాయతీల రైతులకు సేవలందించేందుకు ఐదురైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇందులో బొప్పాపూర్‌లోని రైతువేదికను పూర్తిగా అదే గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్‌గౌడ్‌ తన సొంత డబ్బులు రూ. 24లక్షలతో నిర్మిస్తుండగా, ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్‌ నిధులతో పనులు చేయిస్తున్నారు. వెంకటాపూర్‌లో అదే గ్రామానికి చెందిన కోల నర్సయ్య రైతువేదిక నిర్మాణం కోసం రూ.45 లక్షల విలువ చేసే తన సొంత స్థలం విరాళంగా ఇవ్వగా, ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారు. గొల్లపల్లి, అల్మాస్‌పూర్‌లో ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టగా, పనులు పూర్తయ్యాయి. గొల్లపల్లిలో తుదిదశకు చేరుకున్నాయి.

రైతులకు మేలు..

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అభినందనీయం. అంతేకాకుండా వ్యవసాయంలో రైతులకు సూచనలు, సలహాలు అందించడానికి వేదికలను నిర్మించడం గొప్ప విషయం. తద్వారా సాగుపై అవగాహన పెరిగి పుష్కలంగా పంటలు పండుతాయి. రైతులకు మేలు జరుగుతుంది. 

-బండ నర్సయ్య యాదవ్‌,

 సింగిల్‌ విండో చైర్మన్‌, కోనరావుపేట